చిన్న హీరోలంటే పాపం మరీ ఇంత చిన్నచూపా..!

Mon Jun 27 2022 15:00:01 GMT+0530 (IST)

Tollywood young hero kiran abbavaram movie news

సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అంటే చాలా కష్టం. ఫ్యామిలీ లో ఎవరైనా సినిమా రంగంకు చెందిన వారు ఉంటే అప్పుడు ఎంట్రీ పెద్ద కష్టం కాదు.. కాని ఎప్పుడైతే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోల నటించాలని అనుకుంటారో వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటూ ఎంతో మంది అనుభవాలు మనకు తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో ఎక్కువ శాతం మంది వారసత్వం తో వచ్చిన వారే. వారసత్వం తో కాకుండా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన వారు కొందరు. వారిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకరు.

రాజవారు రాణిగారు సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తూ మెల్ల మెల్లగా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అందులో భాగంగానే తాజాగా సమ్మతమే అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చాడు. మొదటి సినిమా విడుదల అయిన తర్వాత ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుండి పిలుపు వచ్చింది. ఆ బ్యానర్ వారు నాతో సినిమాను చేస్తామన్నారు.

సినిమా ఆఫర్ ఇచ్చిన సదరు నిర్మాణ సంస్థ వారు పారితోషికం ఇచ్చేది లేదని ముందే చెప్పారు. షూటింగ్ కు హాజరు అవ్వడానికి కారు పంపిస్తాం.. అంతే తప్ప పారితోషికం ఇచ్చే పరిస్థితి లేదు అన్నారు. అదేంటి పారితోషికం ఇవ్వకుండా ఎలా నటించేది అన్నాను. హీరోగా ఎదగాలంటే కొన్ని తప్పవు అన్నట్లుగా వారు అన్నారు.

అలాంటి అనుభవాలు నాకు ఎన్నో ఎదురయ్యాయి. కెరీర్ లో మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నాకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు నా వెనుక నుండి ఇబ్బంది పెట్టే విధంగా కూడా వ్యవహరించారు అంటూ కిరణ్ అబ్బవరం సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కిరణ అబ్బవరం ముందు ముందు సక్సెస్ అయ్యి స్టార్ అయ్యేనా చూడాలి.