రిస్క్ తీసుకోలేమంటున్న టాలీవుడ్ స్టార్స్..!

Mon Jan 17 2022 15:23:51 GMT+0530 (IST)

Tollywood stars dont want to take risk

కోవిడ్ ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో స్టార్స్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా మరియు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో స్టార్స్ ఎవరూ రిస్క్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.ఇటీవల కాలంలో పలువురు నటీనటులు - సిబ్బంది వైరస్ బారిన పడటంతో అనేక చిత్రాల షూటింగ్ లు నిలిపివేయబడ్డాయి. ఇప్పుడు చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి అగ్ర నటులందరూ తమ రాబోయే చిత్రాలను సెట్స్ పైకి తీసుకురావడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.

ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని వారాల పాటు ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాడట. అలానే నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని చిత్రాన్ని ఈ జనవరిలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేయగా.. ఇప్పుడు మరికొన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ మీదనే దృష్టి పెట్టాలని భావిస్తున్నారట.

కోవిడ్ నుంచి కోలుకున్న మహేష్ బాబు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. షూటింగ్ లో పాల్గొనడానికి ఇంకాస్త సమయం తీసుకోనున్నారు. ఇక ఇటీవలే రష్యా నుంచి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్.. 'హరి హర వీరమల్లు' షూటింగ్ పునఃప్రారంభించాలని అనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఇంకా సెట్స్ లో అడుగుపెట్టలేదు.

అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్' చిత్రాన్ని ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలిస్తే మార్చిలో సెట్స్ మీదకు వెళ్లాలని అనుకుంటున్నారట. అలానే ట్రిపుల్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా షూటింగ్ కు కాస్త బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో గడుపుతున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క కరోనా భయంతో నవీన్ పొలిశెట్టి సినిమాకు డేట్స్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.
 
ఇలా టాలీవుడ్ స్టార్స్ అందరూ జనవరి - ఫిబ్రవరిలో చిత్రీకరణలో పాల్గొనడానికి మానసికంగా సిద్ధంగా లేరని తెలుస్తోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో.. తమ సినిమాల షూటింగ్ లను ప్రస్తుతానికి హోల్డ్ లో పెడుతున్నారు. కేసులు తగ్గి పరిస్థితులు సానుకూలంగా మారితే తిరిగి సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.