టాలీవుడ్ స్టార్స్.. 200+ కోట్ల గ్రాస్ సినిమాలు..!

Wed May 25 2022 18:00:01 GMT+0530 (IST)

Tollywood stars 200pluse crore gross movies

ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. దీంతో మన హీరోల మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది. 'బాహుబలి' 'RRR' లాంటి సినిమాలు వేల ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల గ్రాస్ రాబడుతున్న తరుణంలో.. 100 కోట్ల షేర్ - 200 కోట్ల గ్రాస్ క్లబ్ అనేది మినిమమ్ బెంచ్ మార్క్ అయిపోయింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంతా అదే టార్గెట్ గా పెట్టుకొని బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ప్రస్తుతమున్న టైర్-1 హీరోలందరూ 100 కోట్ల షేర్ మరియు 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయారు. అయితే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఇంతవరకు ఆ మార్క్ ని అందుకోలేకపోయారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్టుగా 'సర్కారు వారి పాట' సినిమాతో 200+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లోనే SVP ఈ మార్క్ క్రాస్ చేసి రీజనల్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిందని.. 2022లో టాలీవుడ్ లో అతిపెద్ద గ్రాసర్ గా నిలిచిందని మేకర్స్ ప్రకటించారు.

ఇంతకముందు మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' - 'భరత్ అనే నేను' - 'సరిలేరు నీకెవ్వరు' వంటి మూడు సినిమాలు 200 కోట్ల క్లబ్ లో చేరాయి. ఇప్పుడు 'సర్కారు వారి పాట' కూడా ఆ మార్క్ అందుకోవడంతో నాలుగు రెండొందల కోట్ల సినిమాలున్న హీరోగా మహేష్ నిలిచారు. అయితే ఇవన్నీ ప్రాంతీయ చిత్రాలే అవడం విశేషం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో 200+ కోట్ల మార్క్ షేర్ అనేది సెట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన 'బాహుబలి: ది కన్క్లూజన్' మూవీ వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో భారతీయ చిత్రంగా సంచనలం సృష్టించింది. ఇదే క్రమంలో వచ్చిన 'సాహో' సినిమా కూడా 200cr+ గ్రాస్ క్లబ్ లో చేరడంతో ప్రభాస్ కెరీర్ లో మూడు సినిమాలు ఆ కేటగిరీలోకి వచ్చాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాతో 200 కోట్ల క్లబ్ లోకి వచ్చాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో మరోసారి అదే ఫీట్ అందుకున్నారు. ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం 200 కోట్ల గ్రాస్ సాధించారు. RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అత్యధిక వసూళ్ళ భారతీయ సినిమాలో జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' చిత్రంతో 200 కోట్ల గ్రాస్ రాబట్టగా.. గతేడాది చివర్లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' మూవీ మరోసారి బన్నీ ని అదే క్లబ్ లోకి తీసుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కూడా 'సైరా నరసింహా రెడ్డి' వంటి పాన్ ఇండియా సినిమాతో రెండొందల కోట్ల గ్రాస్ ను అధిగమించారు.

అయితే టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరలేకపోయారు. అలానే 100 కోట్ల షేర్ అందుకోలేకపోయారు. భారీ అంచనాల మధ్య వచ్చిన 'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' సినిమాలు కూడా ఈ మార్క్ అందుకోలేకపోయాయి. పవన్ కు ఉండే క్రేజ్ - స్టార్ పవర్ ని బట్టి చూస్తే ఇప్పటికే ఈ క్లబ్ లో చేరాల్సింది. మరి రాబోయే 'హరి హర వీరమల్లు' 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలతో పవన్ 200+ కోట్ల గ్రాస్ క్రాస్ చేస్తారేమో చూడాలి.