'ఫ్యామిలీ మ్యాన్ 3' లో టాలీవుడ్ స్టార్ హీరో..?

Thu Jun 10 2021 13:00:01 GMT+0530 (IST)

Tollywood star hero in Family Man 3

దర్శకద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ ఇటీవలే ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. అక్కినేని సమంత - మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్.. వివాదాలు చుట్టుముట్టినా కూడా భారీ విజయాన్ని సాధించింది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచే 3వ సీజన్ ఎప్పుడంటూ దేశవ్యాప్తంగా డిస్కషన్ చేస్తున్నారంటేనే ఈ వెబ్ సిరీస్ ఎంతగా సక్సెస్ అయిందో అర్థం అవుతుంది. ప్రశంసల జల్లులో తడుసస్తున్న రాజ్ - డీకే.. ప్రస్తుతం 'ఫ్యామిలీ మ్యాన్ 3' స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోని నటింపజేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.తెలుగులో ఎప్పటినుంచో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్న దర్శకద్వయం రాజ్ అండ్ డీకే.. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో శ్రేయా ధన్వంతరి - సందీప్ కిషన్ - సమంత అక్కినేని లాంటి ఇక్కడి నటీనటులను నటింపజేసి సక్సెస్ అయ్యారు. మొదటి సీజన్ లో సందీప్ కిషన్.. రెండో సీజన్ లో సమంతను తీసుకొని సౌత్ లో ఈ సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' లో ఓ స్టార్ హీరోతో క్యామియో చేయించాలని డిసైడ్ అయ్యారట. దీని కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ను ఒప్పించాలని రాజ్ - డీకే ప్రయత్నాలు చేస్తున్నారట.

మహేశ్ బాబు తో ఇప్పటికే దర్శకద్వయం ఓ సినిమా కోసం కథా చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కోసం మహేష్ అంగీకరించకపోవచ్చు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మహేష్.. ఇప్పుడప్పుడే ఓటీటీ రంగంపై దృష్టి పెట్టకపోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో నటించడానికి సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం సంచలనమే అనుకోవాలి. ఇకపోతే మహేష్ ఒప్పుకోకపోయినా ఓ టాలీవుడ్ స్టార్ హీరోని 'ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ లోకి తీసుకోవాలని రాజ్-డీకే సన్నాహాలు చేస్తున్నారట. మరి నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సిరీస్ తదుపరి సీజన్ లో ఎవరు నటిస్తారో చూడాలి.