దళపతితో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమా..?

Mon May 03 2021 12:00:01 GMT+0530 (IST)

Tollywood star director movie with Thalapathy ..?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. ఈ ఏడాదిని మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రారంభించాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషించిన మాస్టర్ మూవీ విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసింది. అయితే మాస్టర్ తర్వాత చిన్న విరామం తీసుకొని దళపతి విజయ్ ఇటీవలే తన 65వ సినిమా మొదలుపెట్టాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఆ భారీ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దళపతి తదుపరి సినిమాలు కూడా ఇండస్ట్రీ వర్గాలలో.. సోషల్ మీడియాలో చర్చలకు దారితీస్తున్నాయి.తాజాగా దళపతి విజయ్ టాలీవుడ్ దర్శకుడుతో స్ట్రెయిట్ తెలుగు సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే విజయ్ కి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఉద్దేశంతోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ఆలోచనలో ఉన్నాడట. అందుకే టాలీవుడ్ డైరెక్టర్ కథను ఓకే చేసినట్లు టాక్ నడుస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం.. ఇటీవలే డైరెక్టర్ వంశీ పైడిపల్లి విజయ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించడం జరిగిందట. ఆ స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ సానుకూలంగా స్పందించి స్క్రిప్ట్ రెడీ చేయాలనీ కోరినట్లు తెలుస్తుంది.

గత ఏడాదిన్నర కాలంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఏ హీరోతో కూడా సినిమా ఓకే చేసుకోలేదు. 2019 మహర్షి తర్వాత వంశీ నుండి ఒక సినిమా కూడా రాలేదు. మరి మొత్తానికి టాలీవుడ్ విడిచి తమిళ స్టార్ హీరోని బాగానే లైన్ లో పెట్టాడంటూ ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యాక హీరో మరోసారి వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం విజయ్ కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు కంప్లీట్ చేసాక ఈ సినిమా పట్టాలెక్కనుందేమో చూడాలి. ప్రస్తుతం విజయ్ చేతిలో డైరెక్టర్ నెల్సన్ సినిమాతో పాటు మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ సినిమా కూడా ఉంది. ఈ సినిమా పై మరింత క్లారిటీ రావాలంటే కొద్దీకాలం ఆగాల్సిందే.