రేసర్ అజిత్ తో టాలీవుడ్ రేసర్ ఎవరై ఉంటారు?

Mon Sep 13 2021 16:01:29 GMT+0530 (IST)

Tollywood racer with racer Ajith

టాలీవుడ్  నటుడు నవదీప్ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ కానప్పటికీ నటుడిగా మాత్రం ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉన్నాడు. అగ్రహీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉనికిని చాటుతున్నాడు. ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేని నేపథ్యంలో కోలీవుడ్ పై దృష్టిపెట్టాడు. అక్కడ  `వీరమ్ దేవి` (వీరమాదేవి- తెలుగు) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సన్నీలియోన్ ప్రధాన పాత్రధారి కాగా కథానాయకుడిగా నవదీప్ నటిస్తున్నారు. వడి ఉడయాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రారంభమై చాలా కాలమవుతోంది గానీ..ప్రాజెక్ట్ డిలే అవుతోంది. తాజాగా నవదీప్ కోలీవుడ్  స్టార్ హీరో తళా అజిత్ తో కలిసి దిగిన ఓ త్రోబ్యాక్ సెల్ఫీని ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు. అజిత్ ని చాలా కాలం క్రితం కలుసుకున్నప్పటి ఫోటో ఇది. ఆయన స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తారు. `హై` అనే స్వరం చాలు అద్భుతంగా మైమరిపిస్తుంది అని పొగిడేశాడు.ఇందులో ఇద్దరు రైడర్స్ దుస్తుల్లో కనిపిస్తున్నారు.  మరి ఆ ఇద్దరు అనుకోకుండా రైడింగ్ లో కలుసుకున్నారా?  లేక ఏదైనా రైడింగ్ పోటీలకు హాజరయ్యారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోటోకి వ్యాఖ్యను జోడిస్తూ అజిత్ వ్యక్తిత్వాన్ని నవదీప్ ఆకాశానికి ఎత్తేసారు.  అజిత్ సింప్లిసిటీ.. సహజంగా  ఉండే ఆయనలోని  మంచి లక్షణాల గురించి నవదీప్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి వ్యక్తితో ఫోటోని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా `వాలిమై `చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో యంగ్ హీరో  కార్తీక్ గుమ్మడి కొండ నటిస్తున్నాడు.  వాస్తవానికి ముందుగా ఆ రోల్ కోసం నవదీప్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ అనుకోకుండా ప్రాజెక్ట్ లోకి కార్తీక్ వచ్చాడు. అలా నవదీప్ ఛాన్స్ కోల్పోవాల్సి వచ్చింది. ఇక నవదీప్ ఇటీవల హిమానీ నదాల్లో సాహసాలు చేయడం ఇన్ స్టా వేదికగా కనిపిస్తోంది. అదంతా అతడి షూటింగ్ కోసం పాట్లు అని అర్థమవుతోంది. అతడి గెటప్ మారింది. భీకర రూపం కనిపిస్తోంది. అలాగే పిలకముడి గుబురు గడ్డాలతో పూర్తిగా ఆశ్యర్యపరుస్తున్నాడు. ఈ కొత్త గెటప్ లో కేజీఎఫ్ విలన్ లా కనిపిస్తున్నాడంటే అతిశయోక్తి లేదు. బహుశా ఆ తరహా పాత్రల కోసం ట్రై చేస్తే అతడి కెరీర్ మరింత మెరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆ సంగతి పక్కనబెడితే .. నవదీప్ పై డ్రగ్స్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు అనంతరం నాలుగేళ్లకు ఈడీ దర్యాప్తు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ నేడు నవదీప్ ని విచారిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న స్టార్లను విచారించినప్పటికీ వాళ్ల నుంచి కీలకమైన సమాచారం  ఏదీ ఈడీ రాబట్టలేకపోయిందనేది ఒక గుసగుస. ఈ నేపథ్యంలో పబ్ నిర్వాహకుడు కం నటుడు నవదీప్ పై విచారణపైనా చర్చ సాగుతోంది.