Begin typing your search above and press return to search.

ఓటీటీ డీల్స్ డెడ్ లైన్ పై టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు..?

By:  Tupaki Desk   |   30 Jun 2022 10:30 AM GMT
ఓటీటీ డీల్స్ డెడ్ లైన్ పై టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు..?
X
ఓటీటీల హవా మొదలైన తర్వాత థియేటర్ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడిందనేది వాస్తవం. భారీ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకూ అన్నీ విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలలోకి వస్తుండటంతో.. మిగతా చిత్రాల థియేట్రికల్ రన్ పై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఎలాగూ మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా అని ఒక వర్గం ప్రేక్షకులు అసలు థియేటర్లకే రావడం మానేశారు. ఈ విషయాన్ని గ్రహించిన టాలీవుడ్ ప్రముఖులు ఈమధ్య వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

థియేట్రికల్ రిలీజ్ మరియు డిజిటల్ విడుదల మధ్య గ్యాప్ ఉండాలనే పరిమితులు పెడితేనే థియేటర్‌ వ్యవస్థను కాపాడుకోవచ్చనే ఓ నిర్ణయానికి వచ్చారు. బుధవారం గిల్డ్ నిర్మాతలు సమావేశమై ఈ విషయంపై చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్‌లో సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని నిర్మాతలు అంగీకరించిన తర్వాత ఈ సమావేశం ముగిసింది.

జూలై 1 నుంచి ఓటీటీ ఒప్పందాలు చేసుకునే సినిమాలకు ఈ నిబంధనలు వర్తింపజేయనున్నారు. అయితే డిజిటల్ రిలీజ్ డెడ్‌ లైన్ విషయంలో నిర్మాతల మధ్య సఖ్యత కుదరడం లేదని టాక్ వినిపిస్తోంది. థియేటర్‌ లో ప్రేక్షకాదరణ పొందని సినిమాలను ఎర్లీగా ఓటీటీకి ఇవ్వకపోతే నిర్మాత రెండు విధాలుగా నష్టపోతాడని కొందరు అభిప్రాయ పడుతున్నారని తెలుస్తోంది.

డిజిటల్ వేదికలు ఎర్లీ ఓటీటీ స్ట్రీమింగ్ ఒప్పందాల కోసం భారీ మొత్తాలను చెల్లిస్తున్నాయి. కొన్ని సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కూడా మంచి రేట్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఇటీవల కొన్ని పెద్ద చిత్రాలు సైతం మూడు నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి ప్రీమియర్‌ అవ్వడానికి ప్రధాన కారణమిదే. కానీ ఇప్పుడు 50 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అంటే మేకర్స్ అలాంటి డీల్స్ కోల్పోతారు.

ఎందుకంటే ఓటీటీ సంస్థలు దీనికి అనుగుణంగానే తక్కువ రేట్లకు ఒప్పందాలు చేసుకుంటారు. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చినా ఇబ్బంది ఉండదు కానీ.. నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలకు మాత్రం సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే కొందరు ఈ నిర్ణయం పై తర్జనభర్జనలు పడుతున్నారని అంటున్నారు.

థియేటర్‌లలో సినిమా ప్రదర్శితమై డిస్ట్రిబ్యూటర్స్ కు పెట్టుబడులు వెనక్కి రావాలంటే.. ఓటీటీకి కనీసం ఈ పరిమితి తప్పదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని పెద్ద సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టలేదు. దీంతో పంపిణీదారులు నష్టపోవాల్సి వచ్చింది.

క్రమక్రమంగా సినిమాల థియేట్రికల్ మార్కెట్ తగ్గిపోతున్న నేపథ్యంలో.. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలను చెల్లించడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. తిరిగి చెల్లించని ఒప్పందాలను కుదుర్చుకునే మానసిక స్థితిలో అసలే లేరు. థియేట్రికల్ మార్కెట్‌ ను కాపాడుకోవడానికి నిర్మాతలు ఓటీటీ డీల్స్‌ పై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.

అదే సమయంలో థియేటర్లలో ఆడని సినిమాల డిజిటల్ రిలీజుల గురించి కూడా ఇక్కడ ఆలోచించాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో టాలీవుడ్ నిర్మాతల మండలి ద్వారా ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తారేమో చూడాలి.