బాలీవుడ్ మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేస్తున్న టాలీవుడ్ హీరోలు...!

Mon Oct 26 2020 23:00:01 GMT+0530 (IST)

Tollywood heroes trying to increase the Bollywood market

టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ ని పెంచుకోవాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ప్రాంతీయ చిత్రం. కానీ 'బాహుబలి' సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతోంది. దీంతో మన హీరోలు కూడా కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమవకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు విడుదల చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్ పై ఫోకస్ చేస్తూ బాలీవుడ్ వైపు డైవర్ట్ అవుతున్నారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి'తో వచ్చిన ఇమేజ్ ని కాపాడుకుంటూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్' 'ఆదిపురుష్' చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బాలీవుడ్ మార్కెట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది.రామ్ చరణ్ 'జంజీర్'(తుఫాన్) అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేశాడు. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. 'జంజీర్' తర్వాత మరో హిందీ మూవీ చేయని చరణ్.. ఇప్పుడు గ్యాప్ తీసుకొని 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో 'రామరాజు ఫర్ భీమ్' వీడియోకి మిగతా భాషలతో పాటు హిందీ వెర్షన్ కి కూడా తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇంతకముందు ఎన్టీఆర్ కూడా చరణ్ ఇంట్రో వీడియోకి హిందీ డబ్బింగ్ చెప్పాడు. వాస్తవానికి తెలుగులో ఇప్పుడు చాలా మంది హీరోలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాటు కొరటాల శివ తో చేయబోయే సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సైతం హిందీ మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు. పూరీ దర్శకత్వంలో వస్తున్న 'ఫైటర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు. రానా దగ్గుబాటి - మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మరి వీరందరూ ఎంత మేరకు సక్సెస్ అవుతారనేది చూడాలి.