2022 మిడ్ కే సెంచరీ దాటేసిన టాలీవుడ్!

Fri Jul 01 2022 14:04:47 GMT+0530 (India Standard Time)

Tollywood crosses the 2022 Mid K Century!

అప్పుడే 2022 ఏడాది సగం రోజులు గడిచిపోయాయి. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టి ఆరు నెలలు పూర్తయింది. కోవిడ్ కూడా తగ్గ డంతో ఏడాది ఇప్పటివరకూ ఉపశమనంగా చెప్పొచ్చు. రెండేళ్ల పాటు కోవిడ్ భయంతో ఒణికిపోయిన జనం సహా టాలీవుడ్  కాస్త ఊపిరి తీసుకోగల్గింది. బాక్సాఫీస్ వద్ద ఫలితాలు ఆశాజనకంగా కనిపించడంతో టాలీవుడ్ ఆరు మాసాల జర్నీ సంతోషమనే చెప్పాలి.ఇప్పటివరకూ తెలుగు తో పాటు అనువాద చిత్రాలు కలిపి ఆరు నెలల్లో 115 సినిమాలు రిలీజ్ అయినట్లు లెక్కలోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించాయి. మరికొన్ని ప్రారంభ వసూళ్లతో అదరగొట్టాయి. ఇంకొన్ని యావరేజ్ విజయాలు సాధించాయి. నిరాశజనకమైన ఫలితాలతోనూ కొన్ని సినిమాలు  ఏడాది సగాన్ని పూర్తి చేసాయి. ఓసారి క్లుప్తగా ఆ సినిమా వివరాలు చూస్తే...

ఈసారి సంక్రాంతికి  చాలా సినిమాలే రిలీజ్ అవుతాయని ప్రచారం పీక్స్ లో సాగింది. కానీ అన్ని తారుమారు అయ్యాయి. కేవలం నాగార్జున..నాగచైనత్య కథానాయకులుగా నటించిన 'బంగార్రాజు' మాత్రమే రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రిజల్ట్ అందుకుంది. అటు పై 'రౌడీబోయ్స్' రిలీజ్ అయి  యువతరాన్ని మెప్పించింది.

భారీ అంచనాల మధ్య  పాన్ ఇడియా చిత్రాలుగా 'ఆర్ ఆర్ ఆర్'...'రాధేశ్యామ్' రిలీజ్ అయ్యాయి. కానీ 'ఆర్ ఆర్ ఆర్' బ్లాక్ బస్టర్ అవ్వగా..'రాధేశ్యామ్' మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. అలాగే 'డీజే టిల్లు'...'భీమ్లా నాయక్' చిత్రాలు భారీ విజయాలు సాధించిన జాబితాలో చేరాయి. ఇక భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'కేజీఎఫ్ -2' అనువాద చిత్రం పెద్ద సక్సెస్ సాధించింది.

'ఆచార్య'తో అదే పరం పర కొనసాగుతుందని ఆశించినా సాధ్యపడలేదు. ఇక మే నెలలో సూపర్ స్టార్ మహేస్ కథానాయకుడిగా నటించిన 'సర్కారు  వారి పాట' రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ ని అభిమానుల్ని అలరించడంలో నూరు శాతం సక్సెస్  అయింది. అలాగే ఇదే నెలలో రిలీజ్ అయిన 'ఎఫ్ -3' కూడా భారీ  విజయాన్ని సాధించింది.

పెద్ద సినిమాల ట్రాక్ అలా ఉంటే చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా 'డీజే టిల్లు'  నిలిచింది. మిగతా చాలా రిలీజ్ లకి  చుక్కెదురైంది. కంటెంట్ లోపంతో ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. జూన్ లో 'అంటే సుందరానికీ'.. 'విరాటపర్వం'.. 'గాడ్సే..గ్యాంగ్ స్టర్ గంగరాజు'... 'సమ్మతమే' సహా 20 సినిమాలకు పైగా రిలీజ్ అయ్యాయి.

సుందరం..విరాట పర్వంకి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్-2'..అడవి శేషు నటించిన 'మేజర్' మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. 'బీస్ట్'. .'వలిమై' ...'ఈటీ' ..'సామాన్యుడు' ..'డాన్'..'గంగూబాయి కతియవాడి' వంటి అనువాద సినిమాలు బాక్సాఫీస్ వద్ద  నామ మాత్రంగానే రాణించాయి.