Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూస‌ర్స్

By:  Tupaki Desk   |   19 April 2019 2:30 PM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూస‌ర్స్
X
టాలీవుడ్ ఫిలింమేకింగ్ లో యువ‌ర‌క్తం ప‌రుగులు పెడుతోందా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా నిర్మాత‌లుగా వ‌చ్చే వాళ్ల‌లోనూ యూత్ పెరగ‌డం కొత్త ట్రెండ్ కి తావిస్తోంది. 30-40 వ‌య‌సు లోపు కుర్రాళ్లు నిర్మాత‌లుగా ఉండ‌డంతో యంగ్ డైరెక్ట‌ర్ల‌కు స్కోప్ పెరుగుతోంది. యువ‌ద‌ర్శ‌కుల భావాల్ని అర్థం చేసుకునే నిర్మాత‌ల సంఖ్య పెర‌గ‌డం ఆశావ‌హం. ఆలోచ‌న‌ల్లో సారూప్య‌త‌లు (ఒకే త‌ర‌హా ఆలోచ‌న‌లు..) ప్ర‌యోగాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌జిలీ, జెర్సీ చిత్రాల్ని ప‌రిశీలిస్తే చాలు. నాగ‌చైత‌న్య - శివ నిర్వాణ -సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది- గోపి సుంద‌ర్ ఇలా అంద‌రూ యువ‌కులే పని చేశారు. జెర్సీ సినిమాని ప‌రిశీలిస్తే నాని-గౌత‌మ్ తిన్న‌నూరి- వంశీ కాంబో ప‌క్కా యూత్. ఈ రెండు సినిమాల క‌థాంశాలు ప్ర‌యోగాత్మ‌క‌మేన‌న్న టాక్ వ‌చ్చింది. అంటే అంత‌క‌త‌కు ప్ర‌యోగాత్మ‌క‌త పెరుగుతోంది. యంగ్ ప్రొడ్యూస‌ర్ల‌లో యాక్టివ్ గా సినిమాలు తీస్తున్న వాళ్లు అంత‌కంత‌కు పెరుగుతుండ‌డం ఈ కొత్త ప‌రిణామానికి కార‌ణం. ప్ర‌స్తుతం వీళ్లంతా గ్లామ‌ర‌స్ ప్రొడ్యూస‌ర్స్ గా అల‌రించ‌డం అనేది మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. కార‌ణం ఏదైనా ఇది యంగ్ హీరోల‌కు, కొత్త టెక్నీషియ‌న్ల‌కు అవ‌కాశాల ప‌రంగా వ‌రంగా మారుతోంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎంద‌రు యువ‌నిర్మాత‌లు ఉన్నారు? వీళ్ల‌లో రెగ్యుల‌ర్ గా వినిపిస్తున్న పేర్లేవి? అన్న‌ది ప‌రిశీలిస్తే.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ .. యంగ్ నిర్మాత‌గా పాపుల‌ర‌య్యారు. ఖైదీ నంబ‌ర్ 150 మొద‌లు వ‌రుస‌గా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీలో సినిమాలు తీస్తున్నారు. మెగాస్టార్ కోస‌మే స్థాపించిన ఈ బ్యాన‌ర్ లో యంగ్ హీరోల‌తో సినిమాలు చేయ‌క‌పోవ‌డంపై చ‌ర్చ సాగుతోంది. మునుముందు చ‌ర‌ణ్ యంగ్ హీరోల‌తో సినిమాలు చేస్తారా? అన్న‌ది వేచి చూడాలి. సూప‌ర్ స్టార్ మ‌హేష్ మ‌హేష్ బాబు (ఎంబీ) ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ బ్యాన‌ర్ ని స్థాపించారు. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ లు.. చిన్న సినిమాల్ని నిర్మిస్తూ మ‌హేష్ - న‌మ్ర‌త జంట‌ దూకుడు పెంచిన సంగ‌తి తెలిసిందే. ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో ఒక‌ప్పుడు యువ‌నిర్మాత‌గా ర‌మేష్ బాబు సినిమాలు తీసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ సైలెంట్ ప్రొడ్యూస‌ర్.. అత‌డి స్నేహితులు ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి.. వంశీ త‌దిత‌రులు యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి అగ్ర నిర్మాత‌లుగా ప‌రిశ్ర‌మ‌లో టాప్ రేంజుకు ఎదిగారు. జీఏ2 బ్యాన‌ర్ లో సినిమాలు నిర్మిస్తున్న బ‌న్ని వాసు యంగ్ ప్రొడ్యూస‌ర్ గా అసాధార‌ణ విజ‌యాలు అందుకున్నారు. 100 ప‌ర్సంట్ ల‌వ్.. గీత గోవిందం లాంటి సంచ‌ల‌నాల్ని ఆయ‌న నిర్మించారు. మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత‌లు న‌వీన్ ఎర్నేని, మోహ‌న్ సీవీ, ర‌వి యంగ్ ప్రొడ్యూస‌ర్ గానే అసాధార‌ణ ఫీట్స్ వేస్తూ ఇండ‌స్ట్రీ టాప్ ప్రొడ్యూస‌ర్లు ఎదిగిన సంగ‌తి తెలిసిందే.

ద‌గ్గుబాటి కాంపౌండ్ నుంచి రానా, అభిరామ్ సినీనిర్మాత‌లుగానూ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ముఖ్యంగా రానా ఓవైపు హీరోగా పీక్స్ లో ఉండీ.. చిన్న సినిమాల్ని ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తున్నారు. అలాగే చిన్న సినిమాల‌కు స‌మ‌ర్ప‌కుడిగా కొన‌సాగుతున్నారు. మునుముందు ద‌మ్మున్న క‌థ‌ల‌తో వ‌స్తే రానా సినిమాలు తీసేందుకు ఆసక్తిగా ఉన్నారు. సినీ నిర్మాత‌గానే కాదు.. వెబ్ సిరీస్ ల‌పైనా రానా దృష్టి సారిస్తున్నారు. నంద‌మూరి హీరోల్లో క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు హీరోగా సినిమాలు.. మ‌రోవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమాల నిర్మాణంతో బిజీ బిజీ. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ పైనా దృష్టి సారించాన‌ని తెలిపారు.

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ మిడిల్ లోనే `డీ ఫ‌ర్ దోపిడీ`తో నిర్మాత అయ్యారు. అ! చిత్రంతో కంబ్యాక్ అయ్యారు. నిర్మాత‌గా మంచి క‌థ‌ల్ని.. ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల్ని ఎంక‌రేజ్ చేసే ఆలోచ‌న‌తో సినిమాల్ని నిర్మించ‌నున్నారు. అలాగే వెబ్ సిరీస్ తీసే ఆలోచ‌నా నానీలో ప్రాధ‌మిక ద‌శ‌లో ఉంది. ఇక ఇప్ప‌టికే బివిఎస్ ఎన్ కుమారుడు బాపినీడు.. నాని `జెర్సీ` నిర్మాత నాగ వంశీ వంటి యువ‌త‌రం నిర్మాత‌లు ఇప్ప‌టికే వ‌రుస‌గా సినిమాలు తీస్తున్నారు. హీరో శ‌ర్వానంద్ నిర్మాత‌గా సినిమాలు తీసి న‌ష్ట‌పోయినా తిరిగి కంబ్యాక్ అయ్యాడు కాబ‌ట్టి మునుముందు సినిమాలు తీస్తాడ‌ట‌. వ‌రుణ్ తేజ్ .. `సూర్య కాంతం` స‌మ‌ర్ప‌కుడుగా ప‌రిచ‌యం అయ్యారు. సినిమాల నిర్మాత‌గా ప్లాన్ ఉంది. సొంత బ్యానర్ లో సినిమాలు.. వెబ్ సిరీస్ ల నిర్మాణం ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక నిహారిక కొణిదెల .. వెబ్ సిరీస్ నిర్మాత అన్న సంగ‌తి తెలిసిందే. మునుముందు ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాలు తీసే ఆస‌క్తి ఉంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ద‌ర్శ‌కుడు సుకుమార్ కుమారి 21ఎఫ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో నిర్మాత‌గా మారారు. అటుపైనా ప‌లు అగ్ర బ్యాన‌ర్ల‌తో కలిసి సినిమాలు నిర్మిస్తూ వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ ట్యాలెంటెడ్ గయ్స్ సినీనిర్మాత‌లుగా కొన‌సాగ‌డంతో అదే ఏజ్ గ్రూప్ వారికి అవ‌కాశాలు పెరుగుతున్నాయి. ఎంచుకునే క‌థ‌ల్లో.. కంటెంట్ లో ప్ర‌యోగాల‌తో కిక్కు అనేది పెరిగింది. ఈ ప‌రిణామం మునుముందు సాంకేతిక నిపుణుల‌కు, ఆర్టిస్టుల‌కు గొప్ప వ‌రంగా మారుతోంది.