Begin typing your search above and press return to search.

#టాలీవుడ్.. వేస‌విని టార్గెట్ చేసిన టాప్ స్టార్స్

By:  Tupaki Desk   |   25 Jan 2021 2:30 AM GMT
#టాలీవుడ్.. వేస‌విని టార్గెట్ చేసిన టాప్ స్టార్స్
X
ప్ర‌పంచ‌దేశాల‌తో పోలిస్తే భార‌త‌దేశంలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌. స్ట్రెయిన్ ప్ర‌భావాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సినేష‌న్ మొద‌ల‌వ్వ‌డంతో స‌ర్వ‌త్రా ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. పాజిటివ్ అంశాలు మెరుగుప‌డుతుంటే ఇత‌ర రంగాల్ని మించి వినోద రంగంలో.. ముఖ్యంగా టాలీవుడ్ లోనూ నూత‌నోత్సాహం వెల్లి విరుస్తోంది. 2021 ఆరంభం బావుంది. సంక్రాంతి సినిమాలు బాగా ఆడాయ‌న్న సంతృప్తి ద‌క్క‌డంతో ఇక‌పై వేసవి రిలీజ్ ల‌పై అంద‌రూ దృష్టి సారించారు.

మెగాస్టార్ చిరంజీవి.. ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఉద్ధండులు ఈసారి స‌మ్మ‌ర్ రేసులోకి దిగేస్తున్నారు. నెల‌రోజుల గ్యాప్ లో ఆ ఇద్ద‌రి సినిమాలు రిలీజ్ కానున్నాయ‌ని ఇంత‌కుముందే తుపాకి వెల్ల‌డించింది. వీరితో పాటు నేచుర‌ల్ స్టార్ నాని.. యువ సామ్రాట్ నాగ చైతన్య.. చియాన్ అఖిల్ అక్కినేని.. యూత్ స్టార్ నితిన్ .. ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ .. వీళ్లంతా వేసవిలో తమ త‌దుప‌రి ప్రాజెక్టులతో త‌మ‌ అదృష్టాన్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. వేసవిలో విదేశీ మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని మ‌న హీరోలంతా ఎంతో ఆశిస్తున్నారు. బ్రిట‌న్ తో పోలిస్తే అమెరికాలో ఇప్పుడు కొంత క‌ట్ట‌డి ఉందన్న ధైర్యం కూడా ఉంది. ఇక బ్రిట‌న్ స్ట్రెయిన్ అమెరికాలోకి ప్ర‌వేశించ‌డాన్ని నిలువ‌రిస్తే టాలీవుడ్ రిలీజ్ ల‌కు.. మార్కెట్ కి డోఖా ఉండ‌దు. అమెరికా కొత్త అధ్య‌క్షుడు ఎంత‌గా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగితే...అంత‌గా టాలీవుడ్ మార్కెట్ కి భ‌రోసా ఉంటుంది.

న‌వ‌త‌రం హీరోలు చాలామంది వేస‌వి పైనే కన్నేశారు. శర్వానంద్- సాయి తేజ్ - నాగ శౌర్య తమ సినిమాలతో రేసులో చేరారు. శర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం `శ్రీకరం` మార్చి 11 న విడుదల కానుంది. సాయి తేజ్ న‌టిస్తున్న `రిపబ్లిక్` ఏప్రిల్ 30 న రిలీజ్ కానుంది. నాగ శౌర్య స్పోర్ట్స్ డ్రామా `లక్ష్య` కూడా ఏప్రిల్ 30 న విడుదలకు సిద్ధమవుతోంది.

మరికొంద‌రు అదృష్టం ప‌రీక్షించుకునేందుకు త‌మ సినిమాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇన్నాళ్లు వెయిట్ చేశారు కాబ‌ట్టి.. ఇక‌పై ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల వ‌ద్ద ఫిక‌ర్ త‌ప్ప‌నిస‌రి అయ్యేట్టుగా స‌న్నివేశం క‌నిపిస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీ ప‌రిమితులు ఎత్తేసేంత‌టి క్లారిటీ ప్ర‌భుత్వాల‌కు వ‌చ్చేస్తే గ‌నుక ఈ గ‌డ‌బిడ మ‌రింత‌గా పెరుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్న దాని ప్ర‌కారం.. ఫిబ్రవరి .. మార్చిలలోనూ శుక్ర‌వారాలు రిలీజ్ లు బాగానే ఉండే వీలుంది. చిన్నా చిత‌కా సినిమాల‌న్నీ ఈ సీజ‌న్ లో రిలీజైపోతాయి. ఇప్ప‌టికే థియేట్రికల్ విడుదల కోసం ఎదురు చూస్తున్న వాళ్లంతా సాధ్య‌మైనంత తొంద‌ర‌గా బ‌రువు దించేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నారు. సినిమాల్ని రిలీజ్ చేసి హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకోవాల్సిన స‌న్నివేశం ఉందిప్పుడు.