Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మార్కెట్ ని ఓటీటీల్లో తొక్కేస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 Sep 2020 5:30 AM GMT
టాలీవుడ్ మార్కెట్ ని ఓటీటీల్లో తొక్కేస్తున్నారా?
X
వ‌రుస రిలీజ్ ల‌తో ఓటీటీ వేదిక వేడెక్కిపోతున్న సంగ‌తి తెలిసిందే. అనుష్క‌ న‌టించిన నిశ్శ‌బ్దం..రాజ్ త‌రుణ్ ఒరేయ్ బుజ్జిగా థియేట్రిక‌ల్ రిలీజ్ ‌ని స్కిప్ చేసి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రెండు చిత్రాలు ప్ర‌త్యేకంగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే మామూలు సంద‌ర్భాల్లో ఈ చిత్రాల‌కు భారీగా బ‌జ్ వుండేది.. కానీ ఈ స‌మ‌యంలో వీటికి సాధార‌ణ క్రేజ్ కూడా క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

ఓ సినిమా రిలీజ్ అవుతోందంటేనే ఇదివ‌ర‌కూ మేక‌ర్స్ కోటి నుంచి రెండు కోట్ల వ‌ర‌కు ప‌బ్లిసిటీ కోసం ఖ‌ర్చు చేసేవారు. కానీ మూవీస్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లో విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో ప్రొడ్యూస‌ర్స్ ప‌బ్లిసిటీ అన్న‌దే ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నిజానికి ప‌బ్లిసిటీ డ‌బ్బుని కూడా నిర్మాత‌లు ఆదా చేసుకోవ‌డం అనే వైఖ‌రి ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అన్న చ‌ర్చా సాగుతోంది. దీనివ‌ల్ల జ‌నంలోకి సినిమా వెళుతుందా? అన్న‌ది సందిగ్ధ‌మేన‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల ప్ర‌ముఖ ఫిల్మ్ మేక‌ర్‌గా పేరున్న దిల్ రాజు త‌ను నిర్మించిన `వి` చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేశారు. అయితే దాని ప్ర‌మోష‌న్స్ అంతంత‌మాత్రంగానే ముగించేశార‌ని.. ఆ ప్ర‌భావం ప‌డింద‌న్న గుస‌గుసా వినిపించింది.

అయితే క‌రోనా కార‌ణంగా అవుట్ డోర్ ప్ర‌మోష‌న్స్ చేయ‌డానికి కుద‌ర‌ని ప‌రిస్థితి. అయితే డిజిట‌ల్ ప్ర‌మోష‌న్స్ కూడా చేయ‌కుండా తెలుగు సినిమా ఓటీటీ మార్కెట్‌ని మ‌న ప్రొడ్యూస‌ర్స్ కిల్ చేస్తున్నారన్న ఘాటైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌న సినిమా మార్కెట్ ఓటీటీల్లో పెర‌గ‌కుండా తొక్కేస్తున్నారన్న ఆవేద‌న జ‌నంలో వ్య‌క్త‌మ‌వుతోంది. డిజిటల్ హక్కుల ద్వారా భారీగా ఆదాయం వ‌చ్చేది. ఇప్పుడు దాన్నీ పోగొడుతున్నారన్న విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇలాగే చేస్తే రేపు థియేట‌ర్లు తెరిచిన త‌రువాత నిర్మాతలు తమను తాము నిందించుకోవలసి ఉంటుంది. ఈ రోజు వారు సేవ్ చేస్తున్నది ఆవ గింజంత‌. కానీ దాని ప్ర‌భావ‌మే వేరుగా ఉంటుంది. కోల్పోయే వాటితో పోల్చినప్పుడు థియేట్రికల్ వ్యాపారం మ‌ళ్లీ మొద‌లైన‌ప్పుడు అది నిర్మాత‌ల్ని త‌ప్ప‌కుండా వెంటాడుతుంది.