ఓ ఇంటివాడు కాబోతున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్

Sat Dec 10 2022 09:29:50 GMT+0530 (India Standard Time)

Tollywood Talented Director Venky Atluri Engagement

మధురా శ్రీధర్ 'స్నేహగీతం' చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించి తర్వాత దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. 'తొలిప్రేమ' సినిమాతో వెంకీ అట్లూరి తెలుగు చిత్రసీమలో డైరెక్టర్ గా ఘనమైన అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా  నిలిచింది. దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత  మిస్టర్ మజ్ను- రంగే చిత్రాలు ఆశించినంతగా విజయం సాధించకపోయినా వెంకీలో టెక్నిక్ కి గుర్తింపు దక్కింది. సాంకేతికంగా పనితనం ఉన్న యువదర్శకుడిగా గుర్తింపు దక్కడంతో అవకాశాల పరంగా వెనుదిరిగి చూసేది లేదని ప్రూవ్ అవుతోంది.ఎట్టకేలకు వెంకీ అట్లూరి లైఫ్ టర్నింగ్ ఫేజ్ మొదలైంది. త్వరలో అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈరోజు అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. అంతేకాదు.. ఈ నిశ్చితార్థం నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ కార్యక్రమానికి మహానటి నిర్మాత స్వప్న దత్ చలసాని సహా ఇతర స్నేహితులు హాజరయ్యారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే... పాన్ వరల్డ్ స్టార్ ధనుష్ తో వెంకీ అట్లూరి SIR (వాతి-తమిళం) అనే ద్విభాషా చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా విజయం అతడి కెరీర్ కి  అత్యంత కీలకం కానుంది. ఇది ప్రతిభావంతుడైన వెంకీకి కొన్ని పెద్ద అవకాశాలను తెచ్చి పెట్టేందుకు  సహాయపడుతుంది. 'సర్' (వాతి) 17 ఫిబ్రవరి 2023న తెలుగు-తమిళంలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సర్ ..వెంకీకి గేమ్ ఛేంజ్ ..?తనదైన విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గొప్ప పాపులారిటీ సంపాదించిన ధనుష్ ని తన హీరోగా ఎంపిక చేయడంతో వెంకీ అట్లూరి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల హాలీవుడ్ లోను ప్రవేశించిన దక్షిణాది స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ తో సర్ చిత్రాన్ని ప్రారంభించాక అంచనాలు మరింతగా రెట్టింపయ్యాయి.

ధనుష్ ద్విభాషా చిత్రం 'సార్' (వాతి-తమిళం) ఇటీవల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విడుదలైన పోస్టటర్లు తొలి సింగిల్ తో ప్రచారంలో వేగం పెంచింది చిత్రబృందం. ఈ ద్విభాషా చిత్రంపై చక్కని అంచనాలేర్పడ్డాయి. ఇది వెంకీకి గేమ్ ఛేంజర్ గా మారుతుందని భావిస్తున్నారు.

ఇందులో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ కథానాయిక. చాలా గ్యాప్ తర్వాత డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.