Begin typing your search above and press return to search.

స్పెషల్ స్టోరీ: టాలీవుడ్ స్టార్ హీరోల రీమేక్ సినిమాలు..!

By:  Tupaki Desk   |   22 Sep 2021 5:30 PM GMT
స్పెషల్ స్టోరీ: టాలీవుడ్ స్టార్ హీరోల రీమేక్ సినిమాలు..!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ సినిమాల హవా కొనసాగుతోంది. చిన్న మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ రీమేక్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాలనేది దీని వెనుకున్న ఒక ఉద్దేశ్యం. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి రిస్క్ ఉండదని హీరోలు నిర్మాతలు భావించడం మరో కారణం. అందుకే ఇతర భాషల సక్సెస్ ఫుల్ సినిమాల రీమేక్ రైట్స్ ని పోటీ పడి మరీ తీసుకుంటున్నారు. కాకపోతే అన్ని సార్లు రీమేక్స్ వర్కౌట్ అవ్వవు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేకులు చేశారో ఇప్పుడు చూద్దాం!

టాలీవుడ్ లో ఎక్కువ రీమేక్స్ చేసిన హీరో విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు. వెంకీ నటించిన చిత్రాల్లో పాతిక వరకు రీమేకులు ఉన్నాయి. 'టూ టౌన్ రౌడీ' 'భారతంలో అర్జునుడు' 'చంటి' 'సుందరకాండ' 'కొండపల్లి రాజా' 'బ్రహ్మ పుత్రుడు' 'అబ్బాయిగారు' 'పోకిరి రాజా' 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' 'సూర్యవంశం' 'రాజా' 'శీను' 'జెమినీ' 'వసంతం' 'సంక్రాంతి' 'బాడీ గార్డ్' 'ఘర్షణ' 'ఈనాడు' 'నాగవల్లి' 'మసాలా' 'గురు' 'గోపాలా గోపాలా' 'దృశ్యం' 'నారప్ప' 'దృశ్యం 2' వంటి రీమేక్ సినిమాలు వెంకటేష్ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు వెంకీ - రానా కాంబోలో వస్తున్న 'రానా నాయుడు' వెబ్ సిరీస్ కూడా అఒక మెరికన్ క్రైమ్ డ్రామాకు రీమేక్ కావడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా అనేక రీమేక్ సినిమాలు ఉన్నాయి. 'చట్టానికి కళ్లులేవు' 'పట్నం వచ్చిన ప్రతివర్తలు' 'విజేత' 'ఆరాధన' 'బంధాలు అనుబంధాలు' 'రాజా విక్రమార్క' 'పసివాడి ప్రాణం' 'ఘరానా మొగుడు' 'ఎస్పీ పరశురామ్' 'హిట్లర్' 'స్నేహం కోసం' 'ఠాగూర్' 'శంకర్ దాదా ఎంబీబీఎస్' 'శంకర్ దాదా జిందాబాద్' 'ఖైదీ నెం.150' వంటి సినిమాలను ఇతర భాషల నుంచి తెచ్చుకున్న కథలతో తెరకెక్కించచారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' 'భోళాశంకర్' సినిమాలు కూడా రీమేక్స్ అనే సంగతి తెలిసిందే.

కింగ్ అక్కినేని నాగార్జున 'విక్రమ్' అనే రీమేక్ సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఈ క్రమంలో 'కిరాయి దాదా' 'నేటి సిద్ధార్థ' 'వారసుడు' 'నిర్ణయం' 'వజ్రం' 'నువ్వొస్తావని' 'నిన్నే ప్రేమిస్తా' 'చంద్రలేఖ' 'స్నేహమంటే ఇదేరా' 'ఊపిరి' 'రాజుగారి గది 2' వంటి రీమేక్ చిత్రాల్లో నటించారు. ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్ లో పది చిత్రాలకు పైగానే రీమేక్స్ ఉన్నాయి. 'ఆత్మబలం' 'డిస్కో కింగ్' 'మంగమ్మ గారి మనవడు' 'ముద్దుల మామయ్య' 'మువ్వ గోపాలుడు' 'నిప్పులాంటి మనిషి' 'అన్నదమ్ముల అనుబంధం' 'అశోక చక్రవర్తి' 'పాండు రంగడు' 'శ్రీరామరాజ్యం' 'లక్ష్మీ నరసింహ' వంటి రిమేక్ చిత్రాల్లో బాలయ్య నటించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి వెనుకాడడు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే రీమేక్ సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్.. 'గోకులంలో సీత' 'సుస్వాగతం' 'తమ్ముడు' 'ఖుషీ' 'అన్నవరం' 'తీన్ మార్' 'గబ్బర్ సింగ్' 'కాటమరాయుడు' 'వకీల్ సాబ్' వంటి రీమేక్ చిత్రాల్లో నటించాడు. 'అజ్ఞాతవాసి' సినిమా అధికారిక రీమేక్ కాదు కానీ.. 'లార్గో విచ్' అనే ఫ్రెంచ్ చిత్రానికి అనుకరణ. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' కూడా రీమేకే.

మాస్ మహారాజా రవితేజ 'ఇడియట్' 'నా ఆటోగ్రాఫ్-స్వీట్ మెమొరీస్' 'దొంగోడు' 'వీడే' 'శంభో శివ శంభో' వంటి రీమేక్స్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'యోగి' 'బిల్లా' - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'తుఫాన్' 'ధృవ' వంటి రీమేక్ చిత్రాల్లో నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'నరసింహుడు' అనే రీమేక్ చేశారు. ఇక నేచురల్ స్టార్ నాని 'భీమిలీ కబడ్డీ జట్టు' 'ఆహా కల్యాణం' వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.