Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఓవ‌ర్సీస్ ద‌ళారీల‌కు ఇక మూడిన‌ట్టే!

By:  Tupaki Desk   |   14 Aug 2019 4:07 AM GMT
టాప్ స్టోరి: ఓవ‌ర్సీస్ ద‌ళారీల‌కు ఇక మూడిన‌ట్టే!
X
టాలీవుడ్ కి ఓవ‌ర్సీస్ మార్కెట్ ఎంతో కీల‌కంగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న ప్ర‌తి సినిమా ఓవ‌ర్సీస్ మార్కెట్ ని అందిపుచ్చుకుంటున్నాయి. స్టార్ ఇమేజ్ తో ప‌ని లేకుండా అక్క‌డ సినిమాలు చ‌క్క‌ని రిజ‌ల్ట్ అందుకోవ‌డం ఆస‌క్తిని రేపుతోంది. అయితే అలాంటి కీల‌క‌మైన మార్కెట్లో ద‌ళారీ వ్య‌వ‌స్థ చాప‌కింద నీరులా చుట్టేసి ఇప్పుడు పెద్ద రేంజులో పెట్రేగ‌డంపై నిర్మాత‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏ రంగంలో అయినా ఒకేచోట బిజినెస్ చేస్తూ మేట‌లు వేస్తే అటుపై ప‌రిణామాలు తీవ్రంగానే ఉంటాయి. అలా ఓ ప‌దిమంది సీనియ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్లు ప‌దేళ్లుగా ఓవ‌ర్సీస్ బిజినెస్ లో బ‌లంగా పాతుకుపోయారు. ఎంత‌గా అంటే వీళ్లు ఏం చెబితే అది నిర్మాతలు వినాలి. ఎదురు చెప్పేందుకు లేదు. భారీగా పెట్టుబ‌డి పెట్టి తీసిన‌ సినిమాని స్వేచ్ఛ‌గా త‌మ‌కు న‌చ్చిన ధ‌ర‌కు అమ్ముకునే ఛాన్సే లేనంత‌గా స‌ద‌రు డిస్ట్రిబ్యూట‌ర్లు రింగ్ వేశార‌ని తెలుస్తోంది. ఆ కొద్ది మంది పంపిణీదారులు రింగ్ మాస్ట‌ర్లుగా మారి తెలుగు సినిమాల మార్కెట్ ని కిందికి దించేస్తున్నార‌ట‌. అంతేకాదు ఈ రంగంలోకి రావాల‌నుకునే కొత్త డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు వీళ్లు పెద్ద థ్రెట్ గా మారారు. మార్కెట్ ని స్వేచ్ఛ‌గా సాగ‌నీకుండా పూర్తిగా మోనోప‌లి సృష్టించి అక్క‌డా ఆ న‌లుగురు చందంగా త‌యార‌య్యార‌న్న ముచ్చ‌టా సాగుతోంది.

అందులో కీల‌కంగా ఓ న‌లుగురైదుగురు డిస్ట్రిబ్యూట‌ర్లు సిస్ట‌మ్ ని శాసించే స్థాయికి ఎదిగిపోయారు. ఓవ‌ర్సీస్ లో ఉత్ప‌త్తికి త‌గ్గ‌ట్టే పెద్ద ధ‌ర ప‌ల‌క‌కుండా నిలువ‌రించేస్తున్నారు. దీంతో వీళ్లంద‌రిపైనా తెలుగు సినిమా నిర్మాత‌లు గ‌రంగ‌రంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు స‌మ‌స్య మ‌రీ సీరియ‌స్ గా త‌యార‌వ్వ‌డంతో ప‌రిష్కారం కోసం యోచిస్తున్నార‌ట‌. ఆ న‌లుగురు లేదా ఆ ప‌దిమంది వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గానే దృష్టి సారిస్తున్నార‌ని తెలుస్తోంది. తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన నిర్మాత‌ల మీటింగ్ లోనూ దీనిపై సీరియ‌స్ గా చ‌ర్చించార‌ని లీకు అందింది. ఇక‌పై మ‌ధ్య‌వ‌ర్తుల‌తోనో లేదా ద‌ళారీల‌తోనో ప‌ని లేకుండా నేరుగా అస‌లైన‌ పంపిణీదారుల‌తోనే యాక్సెస్ ఉండేలా.. మ‌ధ్య‌వ‌ర్తుల్ని నిలువ‌రించేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. వ్య‌వ‌స్థ‌ను చెద ప‌ట్టి తొలిచేస్తుంటే దానిని వ‌దిలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇప్పుడు ఓవ‌ర్సీస్ మార్కెట్ కి ప‌ట్టిన చెద‌ను దులిపేయాల‌నే ఆలోచ‌న నిర్మాత‌లు చేస్తున్నార‌ట‌. ఓవ‌ర్సీస్ గ్యాంబ్ల‌ర్స్ లేదా ఓవ‌ర్సీస్ ద‌ళారీలు ఎవ‌రు అన్న‌ది ఇప్ప‌టికే జాబితా రూపొందించారు. ఇక వీళ్ల‌తో అనుసంధానంగా ఉండే మీడియేట‌ర్స్ ఎంద‌రు ఉన్నారు? వీళ్లు ఈ మార్కెట్లో ఎలాంటి నాట‌కాలు ఆడుతున్నారు? అన్న‌దానిపై నిర్మాత‌ల వింగ్ ఆరాలు తీస్తోంది. రింగ్ మాస్ట‌ర్ల ఆట క‌ట్టించేందుకు స‌రికొత్త ప్లాన్ ని నిర్మాత‌లంతా ఒకే గొడుగు కింద‌కు వ‌చ్చి సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది.