Begin typing your search above and press return to search.

డిజిట‌ల్ ప్ర‌మాదంపై క‌ళ్లు తెరిచారా!

By:  Tupaki Desk   |   18 Nov 2019 8:09 AM GMT
డిజిట‌ల్ ప్ర‌మాదంపై క‌ళ్లు తెరిచారా!
X
టాలీవుడ్ కి ముంచుకొస్తున్న ముప్పు గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌పంచం మొత్తం స్మార్ట్ కుగ్రామంగా మారిపోయిన ఈ త‌రుణంలో డిజిట‌ల్ రాక పెను ప్ర‌మాదంగా మార‌బోతోందా? అంటూ విశ్లేషిస్తున్నారు. మునుముందు టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌ మ‌నుగ‌డ‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఎలా ఉండ‌బోతోంది? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది.

ఇప్ప‌టికే అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ వంటి డిజిట‌ల్ స్ట్రీమింగ్ దిగ్గ‌జాలు పోటీప‌డి మ‌రీ సినిమాల్ని లైవ్ లోకి తెచ్చేస్తున్నాయి. కొత్త సినిమా ఇంకా థియేట‌ర్ లో ఆడుతుండ‌గానే.. కేవ‌లం నాలుగు వారాల్లో ఆన్ లైన్ స్ట్రీమింగుకి తెచ్చేస్తుండ‌డంతో అది కాస్తా పంపిణీ వ‌ర్గాలు.. బ‌య్య‌ర్ల‌లో క‌ల‌వరానికి కార‌ణ‌మ‌వుతోంది. డిజిట‌ల్ రైట్స్ అమ్ముకుని నిర్మాత‌లు లాభ‌ప‌డుతున్నా సినిమాని కొనుక్కున్న బ‌య్య‌రు మాత్రం చాలా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వ్వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనిపై ఇటీవ‌ల టాలీవుడ్ లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. పంపిణీ వ‌ర్గాలు ఎగ్జిబిట‌ర్ల‌లోనూ దీనిపై వైర‌ల్ గా మాట్లాడుకుంటున్నారు. అమెజాన్- నెట్ ఫ్లిక్స్ లాంటి విదేశీ కార్పొరెట్ దిగ్గ‌జాల వ‌ల్ల మ‌న సినిమాల‌కు అద‌న‌పు ఆదాయం పెరిగింద‌ని భావిస్తున్నా.. వీటి వ‌ల్ల మును ముందు ర‌క‌ర‌కాల ప్ర‌మాదాలు పొంచి ఉన్నాయ‌ని మ‌న మేక‌ర్స్ విశ్లేషిస్తున్నారు.

ఆ క్ర‌మంలోనే తెలుగు ఫిలింఛాంబ‌ర్ - నిర్మాత‌ల మండ‌లి సంయుక్తంగా ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నాయ‌ని తెలుస్తోంది. ఇక‌పై డిజిట‌ల్ లో అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ ల‌కు చెక్ పెట్టాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ట‌. ఆ రెండు విదేశీ కార్పొరెట్ దిగ్గ‌జాలు థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ను పెద్ద దెబ్బ కొడుతున్నాయి. థియేట‌ర్ల నుంచి రెవెన్యూ రాకుండా చేస్తున్నాయి. చాలా వ‌ర‌కూ బ‌య్య‌ర్ల‌కు నష్టాలు వ‌స్తున్నాయి అంటూ విశ్లేషించార‌ట‌. ఇక‌పై డిజిట‌ల్ స్ట్రీమింగుకి అమ్మాలి అనుకుంటే తెలుగు సినిమాల్ని కేవ‌లం జీ5- హాట్ స్టార్-స‌న్ నెక్స్ట్ వంటి శాటిలైట్ చానెల్ బేస్డ్ గా ఉన్న వాటికి మాత్ర‌మే హ‌క్కులు క‌ట్ట‌బెట్టాల్సి ఉంటుంద‌ట‌. దీనివ‌ల్ల శాటిలైట్ - డిజిట‌ల్ కాంబినేష‌న్ వ‌ల్ల‌ న్యాయం చేసిన‌ట్ట‌వుతుంద‌ని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన రూల్ ని పాస్ చేసేందుకు ఛాంబ‌ర్ - నిర్మాతల మండ‌లి సంసిద్ధ‌మ‌వుతున్నాయ‌ని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రివీల్ కావాల్సి ఉంది.