Begin typing your search above and press return to search.

జూన్ బాక్సాఫీస్: భారీ వసూళ్లతో ప్రారంభమై.. బ్యాడ్ కలెక్షన్లతో ముగిసింది..!

By:  Tupaki Desk   |   26 Jun 2022 6:30 AM GMT
జూన్ బాక్సాఫీస్: భారీ వసూళ్లతో ప్రారంభమై.. బ్యాడ్ కలెక్షన్లతో ముగిసింది..!
X
సమ్మర్ సీజన్ ను భారీ బడ్జెట్ సినిమాలు - పాన్ ఇండియా చిత్రాలు క్యాష్ చేసుకున్నాయి. వీటి కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిన్న మీడియం రేంజ్ సినిమాలన్నీ జూన్ రెండో వారం నుంచి థియేటర్లకు క్యూలు కడుతున్నాయి. కాకపోతే స్కూళ్ళు కాలేజీలు తెరుచుకోవడం.. ఆసక్తికరమైన సినిమాలేవీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద సందడి కాస్త తగ్గింది.

అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన 'మేజర్' సినిమాతో జూన్ నెల ప్రారంభమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న థియేటర్లలోకి వచ్చింది. 26/11 ముంబై టెర్రర్ ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అదే రోజున లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన మూవీ.. సంచలన విజయం సాధించింది. ఇప్పటికే అక్కడక్కడా మంచి వసూళ్ళను రాబడుతోంది. తెలుగులో యువ హీరో నితిన్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి రెండింతల లాభాలను అందుకున్నారు.

ఇక జూన్ 3వ తారీఖునే వచ్చిన అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' మూవీ హిందీతో పాటుగా తెలుగులోనూ నిరాశ పరిచింది. ఆ తర్వాత వారంలో నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే సుందరానికి' సినిమా విడుదలైంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. దానికి తగ్గట్టుగా వసూళ్లను రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో నాని కెరీర్ లో మరో ప్లాప్ గా మిగిలింది.

జూన్ 10నే కన్నడ డబ్బింగ్ సినిమా '777 చార్లీ' రిలీజ్ అయింది. రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తెలుగు ప్రేక్షకులకు అందించారు. మనుషులకు పెంపుడు జంతువులకు మధ్య ఎమోషనల్ బాండింగ్ ను ఆవిష్కరించిన ఈ సినిమా పర్వాలేదనిపించింది.

జూన్ 17న రానా - సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన 'విరాటపర్వం' సినిమా థియేట్రికల్ రిలీజ్ అయింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో విలక్షణమైన ప్రేమకథగా దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని రూపొందించారు. డి.సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. పాజిటివ్ టాక్ తో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న ఈ మూవీ.. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది.

సత్యదేవ్ నటించిన 'గాడ్సే' సినిమా కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అదే సమయంలో కొన్ని చిన్న చిత్రాలు వచ్చాయి కానీ.. ఎప్పుడు వచ్చాయో కూడా తెలియకుండానే వెళ్లిపోయాయి.

జూన్ చివరి వారంలో దాదాపు పది సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఎంఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్' - రామ్ గోపాల్ వర్మ 'కొండా' - కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' - పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన 'చోర్ బజార్' వంటి సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ఏదీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు.

'గ్యాంగ్ స్టర్ గంగరాజు' 'సదా నన్ను నడిపే' 'కరణ్ అర్జున్' 'సాఫ్ట్ వేర్ బ్లూస్' వంటి మరికొన్ని చిన్న చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. పట్టించుకున్న నాధుడే లేడు. దీంతో నెలాఖరున వచ్చిన సినిమాలలో ఏ ఒక్కటీ హిట్ అవ్వలేదు. ఓవరాల్ గా జూన్ బాక్సాఫీస్ భారీ వసూళ్లతో ప్రారంభమై.. బ్యాడ్ నంబర్స్ తో ముగిసిందని చెప్పాలి. మరి అనేక సినిమా రిలీజులు ప్లాన్ చేసిన జులై నెల ఎలా ఉంటుందో చూడాలి.