టాలీవుడ్ రెడీ బట్.. శేఖరుడు నాట్ రెడీ?

Tue May 24 2022 20:00:01 GMT+0530 (IST)

Tollywood Movie Shekar

టాలీవుడ్ లో ఎవరి జాతకాలు ఎప్పుడ తారు మారౌతుంటాయో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రతీ శుక్రవారం ప్రతీ సినిమా కొంత మంది జాతకాల్ని మార్చేస్తూ వుంటుంది. ఎవరి స్టార్ డమ్ ఎప్పుడు పోతుందో.. ఎవరికి స్టార్ డమ్ వచ్చి పడుతుందో చెప్పడం కష్టం. ఇలాంటి నేపథ్యంలో హీరో డా. రాజశేఖర్ పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మలయాళ హిట్ ఫిల్మ్ 'జోసెఫ్' ఆధారంగా తెరకెక్కింది.మెగాస్టార్ సినిమాకే ఆదరణ దక్కక ప్రేక్షకులు థియేటర్లకు రాని ఈ రోజుల్లో రాజశేఖర్ నటించిన 'శేఖర్'కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అన్నవి అనుమానమే. ఒక దశలో రాజశేఖర్ సినిమా అంటే మహిళా ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారు థియేటర్లకు వచ్చేవారు. కానీ ఇప్పడు పరిస్థితి మారింది. క్రేజ్ తగ్గింది. కరోనా కారణంగా ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ స్టార్ సినిమా అయితే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.

ఈ నేపథ్యంలో రాజశేఖర్ సినిమా అంటే కష్టమే. 'శేఖర్' విషయంలోనూ అదే జరుగుతోంది. ఒకప్పుడు యాండ్రీ యంగ్ మెన్ గా ఆకట్టుకున్న రాజశేఖర్ ఇప్పడు ఆ స్థాయి క్రేజ్ ని కోల్పోయారు. హీరోగా ఆయన మార్కెట్ స్థాయి కూడా పడిపోయింది. గరుడవేగ కల్కి సినిమాలతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన ఆయన ఆ సినిమాలతో భారీ లాభాల్ని మాత్రం అందించలేకపోయారు. ఇక కోవిడ్ తరువాత ఆయన పరిస్థితి మరింతగా మారిపోయింది.

హీరోగా చాలా వరకు డౌన్ ఫాల్ అయ్యారు. అయితే ఇప్పటికీ హీరోగానే చేస్తానని కూర్చోకుండా తనకు తగ్గ విలన్ పాత్రల్లో నటిస్తే ఆయనలోని మరో కోణాన్ని చూడొచ్చన్నది టాలీవుడ్ వర్గాల వాదన. గతంలో రామ్ చరణ్ నటించిన 'ధృవ'తో తన పంథా మార్చుకోవాలని చూశారు రాజశేఖర్. అందులో అరవింద్ స్వామి పోసించిన స్టైలిష్ విలన్ పాత్రతో కొత్త ఇన్నింగ్స్ ని ప్రారంభించాలని ప్రయత్నించారు. కానీ ఆ అవకాశం మళ్లీ అరవింద్ స్వామికే ఇవ్వడంతో నిరాశ చెందారు.

ఇక ఆ తరువాత చాలా మంది చాలా రకాలుగా విలన్ పాత్రల కోసం రాజశేఖర్ ని అనుకున్నా ఆ పాత్రలు నచ్చకపోవడంతో రాజశేఖర్ తిరస్కరించారట. ఇప్పటికైనా మించిపోయింది లేదని రాజశేఖర్ తన పంథాను మార్చుకుని విలన్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగులో సరికొత్త సినిమాలు సరికొత్త కాంబినేషన్ లకు తెరలేస్తుందని అంతా అంటున్నారు.

ఆయనకు కొత్త జర్నీని అందించడానికి టాలీవుడ్ ఎప్పటి నుంచో సిద్ధంగా వుందని కానీ శేఖరుడే ఇంకా తన నిర్ణయాన్ని ఓపెన్ గా చెప్పడం లేదని అంటున్నారు. మరి ఇప్పటికైనా రాజశేఖర్ తన పంథాను మార్చుకుని విలన్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.