CHIRANJEEEVI: న్యూమరాలజీ కాదు.. నెంబర్ గేమూ కాదు.. అది పొరపాటు మాత్రమేనట!

Wed Jul 06 2022 09:34:33 GMT+0530 (IST)

Tollywood MegaStar Chiranjeevi

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు.. స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారు. 'చిరంజీవి' పేరుతోనే ఆయన 'మెగాస్టార్' అయ్యారు. అయితే ఇప్పుడు సీనియర్ హీరో తన పేరు మార్చుకున్నారని సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.తన యాక్టింగ్ తో డ్యాన్సులు ఫైట్స్ తో అశేష అభిమాన ఘనాన్ని ఏర్పరచుకున్న మెగాస్టార్ అసలు పేరు 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనే సంగతి తెలిసిందే. చిరంజీవిగా పేరు మార్చుకొని ఫేట్ మార్చుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే ఇప్పుడు సడన్ గా 'గాడ్ ఫాదర్' సినిమాలో ఆయన పేరులో స్పెల్లింగ్ మారడం హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రెండు రోజుల క్రితం రిలీజ్ చేశారు. అందులో చిరు పేరులో కొత్తగా మూడో 'E' ను యాడ్ చేశారు. 'Chiranjeevi' కి బదులు.. 'Chiranjeeevi' అని ఉంది. పేరులో 'EEE' అని ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే చిరు న్యూమరాలజీ ద్వారా పేరు మార్చుకున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి.

సాధారణంగా సినిమా వాళ్ళకి నమ్మకాలు కాస్త ఎక్కువే. సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. న్యూమరాలజీ గ్రాఫాలజీ అంటూ పేర్లు మార్చుకోవడమో లేదా స్పెల్లింగ్ చేంజ్ చేసుకోవడమో చేస్తుంటారు. అలానే చిరంజీవి కూడా చేసి ఉంటారని టాక్ నడిచింది.

'సైరా నరసింహా రెడ్డి' సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోవడం.. 'ఆచార్య' మూవీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో.. చిరు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అదే సమయంలో 'మెగాస్టార్' అయ్యింది 'చిరంజీవి' పేరు మీదనే కదా? అలాంటిది ఇప్పుడు రెండు సినిమాలు నిరాశ పరిచాయని పేరులో అక్షరాలు చేంజ్ చేయడమేంటి? అని సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ వార్తలను చిత్ర వర్గాలు ఖండించారని తెలుస్తోంది.

'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో చిరంజీవి (CHIRANJEEVI) పేరులో అదనపు 'E' ఉండటం పొరపాటు మాత్రమేనని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లు అది పేరు మార్పు కాదని.. ఎడిటింగ్ లో జరిగిన మిస్టేక్ మాత్రమే అని స్పష్టం చేసింది. ఆ పొరపాటును వెంటనే సరిదిద్దామని.. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి సరికొత్త గెటప్ లో ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. కొణిదెల కంపెనీ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.