వరద బాధితులకు అండగా టాలీవుడ్ హీరోలు.. లక్షల్లో విరాళాలు

Wed Dec 01 2021 19:24:41 GMT+0530 (IST)

Tollywood Heroes make donations as help aid

ఏపీలో టిక్కెట్ల రేట్ల గొడవ ఓ వైపు సాగుతూనే ఉంది. ఏపీలోని జగన్ సర్కార్ టాలీవుడ్ ను ఇబ్బంది పెట్టేలా టిక్కెట్ల రేట్లను స్టిక్ట్ చేసింది. బెనిఫిట్ ప్రీమియర్ షోలను రద్దు చేసింది. సినీ ఇండస్ట్రీని చావుదెబ్బ తీసే నిర్ణయాలను తీసుకుంది.ఈ క్రమంలోనే ఏపీలోని రాయలసీమలో వరదలు వచ్చాయి. టాలీవుడ్ హీరోలు దీనిపై స్పందించడం లేదన్న విమర్శలు వచ్చాయి.అటు ఏపీ సీఎం జగన్ పంతం.. ఇటు టాలీవుడ్ ప్రముఖుల గుర్రుతో పరిస్థితులు ఎలా మారుతాయోనన్న సందేహాల నడుమ ఒక్కసారిగా పరిస్థితి మారింది. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ వరదలకు స్పందించారు. తమ విలువైన సాయాన్ని అందించారు.

ఏపీలో ఇటీవల తుఫాన్లతో వచ్చిన భారీ వర్షాలు వాటివల్ల వచ్చిన వరదలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వందల ఎకరాల పంటనష్టంతోపాటు వ్యక్తిగతంగా కూడా ఆస్తుల నష్టం కలిగింది.  దీంతో వరద బాధితులకు టాలీవుడ్ హీరోలు ఇవాళ వరుసగా సాయం ప్రకటించారు.

ఏపీలో వరద వర్ష బీభత్సానికి నష్టపోయిన బాధితులకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా రూ.25 లక్షల సాయం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ సహాయనిధికి ఈ విరాళం అందజేశారు.

-ఇక చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రాంచరణ్ కూడా బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి ప్రకటించారు. చిరు రాంచరణ్ కలిసి 50 లక్షల రూపాయల విరాళం అందజేశారు. విపత్తలుకు మెగా ఫ్యామిలీ ముందుంటుందని మరోసారి నిరూపించారు.

-జూనియర్ ఎన్టీఆర్ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు సాయం ప్రకటించారు. తనవంతుగా రూ.25 లక్షల సాయం ప్రకటించారు.

-సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఏపీ వరదబాధితులకు రూ.25 లక్షల సాయం ప్రకటించారు.వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.

ఇక మరికొందరు హీరోలు సైతం వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారికి తమ వంతు సాయంగా ప్రకటించనున్నారు.

ఇప్పటివరకూ వరద బాధితులకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఎన్నారైలు మాత్రమే సాయం చేస్తుండగా.. టిక్కెట్ల గొడవ బెనిఫెట్ షోలు రద్దు చేసిన ఏపీ సర్కార్ తో వివాదాలు విభేదాలు విడనాడి టాలీవుడ్ హీరోలంతా సాయం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి టాలీవుడ్ విషయంలో జగన్ మనసు మారుతుందా లేదా అన్నది వేచిచూడాలి.