Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మేకర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా..?

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:10 AM GMT
టాలీవుడ్ మేకర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా..?
X
పాండమిక్ తర్వాత జనాలు సినిమాలు చూడటానికి థియేటర్లకు రావడం లేదనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కు అలవాటు పడిపోయిన ఫ్యామిలీ ఆడియన్స్.. ఇంట్లోనే నచ్చిన స్క్రీన్ మీద సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారని అభిప్రాయానికి వచ్చారు.

సెలెక్టివ్ గా థియేటర్లలో మూవీస్ చూస్తున్నారని.. టీజర్ - ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని భావించారు. కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయని నిర్ధారణకు వచ్చేసారు. అయితే వీటన్నింటితో పాటుగా సరసమైన టికెట్ రేట్లు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయని ఇప్పుడు నిరూపితమైంది.

నిజానికి పాండమిక్ తర్వాత, దేశవ్యాప్తంగా సినిమా టిక్కెట్ ధరలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కరోనా టైంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నామంటూ.. కొన్ని రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు పెంచడంతో ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను చూడటానికి వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో జనాలను రప్పించడానికి 'సాదారణ రేట్లతో సినిమా చూపిస్తాం' అని పోస్టర్స్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే అంతకంటే తక్కువ ధరలు పెడితే జనాలు ఎక్కువగా వస్తారని ఇప్పుడు అర్థమవుతోంది. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 23వ తేదీన దేశంలోని ప్రధాన మల్టీప్లెక్స్‌ లు మరియు సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో కేవలం రూ.75కి సినిమా టిక్కెట్‌లను విక్రయించిన సంగతి తెలిసిందే.

దీంతో ఒక్క రోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6.5 మిలియన్ల మంది థియేటర్లలో సినిమాలను వీక్షించడం ఒక రికార్డుగా నమోదైంది. కొన్ని థియేటర్లలో ఉదయం 6 గంటల షోలు కూడా ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. దీన్ని బట్టి ప్రేక్షకులు సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని.. కాకపోతే అధిక టిక్కెట్ ధరలే ప్రధాన అవరోధంగా మారాయని స్పష్టంగా తెలుస్తోంది.

నార్త్ లో 'బ్రహ్మాస్త్ర' 'చుప్' 'సీతా రామం' (హిందీ) చిత్రాలకు అనూహ్యమైన స్పందన లభించింది. దాదాపు షోలన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. మిక్స్డ్ రెస్పాన్స్ తో థియేటర్లలో నడుస్తున్న 'బ్రహ్మాస్త్ర: శివ' సినిమా షోలన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయంటేనే జనాలు ఎంతగా ఆసక్తి కనబరిచారో అర్ధమవుతుంది. తక్కువ రేట్లు పెడితే 'బాయ్ కాట్ బాలీవుడ్' బ్యాచ్ కూడా సినిమాని ఆపలేరని స్పష్టం చేసింది.

అయితే నార్త్ బెల్ట్ లో రూ.75 ధరను కచ్చితంగా అమలు చేయగా.. సౌత్ లో మాతృ ఇవేమీ పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏ మల్టీప్లెక్స్ లేదా ఏ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో కూడా ఆ రేటుకు టికెట్లు విక్రయించలేదు. హైదరాబాద్‌ లోని కొన్ని మల్టీప్లెక్స్‌లు ట్యాక్సులు కలిపి రూ.100 కిపైగా రేటుతో టిక్కెట్లను అమ్మారని తెలుస్తోంది.

మొత్తం మీద సెప్టెంబరు 23వ తేదీ ప్రేక్షకులు అత్యధికంగా హాజరైన రోజు అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక్క రోజులో 65 లక్షల మంది థియేటర్లకు వచ్చి సినిమా చూడటం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇదంతా కేవలం తక్కువ టికెట్ ధరల వల్లనే సాధ్యమైందనే ఇక్కడ మనం గమనించాలి.

నేషనల్ సినిమా డేకి వచ్చిన అద్భుతమైన స్పందనతో ప్రొడ్యూసర్స్ - డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్‌లు 'సరసమైన టిక్కెట్ రేట్ల' ప్రాముఖ్యత ఎంతనేది ఆలోచించుకోవాల్సిన అవసరముంది. టికెట్ రేట్లు తగ్గిస్తే.. ఎక్కువ జనాలను సినిమా హాళ్ల వరకూ నడిపించగలమని గమనించాలి.

ఇటీవల కాలంలో అధిక టికెట్ రేట్లు పెట్టిన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్.. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫ్లెక్సిబుల్ రేట్లు - తక్కువ టికెట్ ధరలను పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టిక్కెట్ ధరలు ఎంత తక్కువగా ఉంటే.. అంత ఎక్కువ ప్రేక్షకులు సినిమాలను థియేటర్లలో చూడటానికి సిద్ధంగా ఉన్నారనే విషయం గుర్తిస్తే.. టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పటిలాగే కళకళలాడుతూ ఉంటుందని అంటున్నారు.