టాలీవుడ్ కాస్ట్యూమ్స్ హాలీవుడ్ రేంజ్

Thu Sep 12 2019 12:38:50 GMT+0530 (IST)

భారీ యాక్షన్ సినిమాలు.. హిస్టారికల్ సినిమాలు అంటే బడ్జెట్లు ఆ స్థాయిలోనే కేటాయించాల్సి వస్తోంది. ముఖ్యంగా విజువల్ గ్రాఫిక్స్ - ఎఫెక్ట్స్ విభాగానికి వందల కోట్లు వెచ్చిస్తున్నారు మన మేకర్స్. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ - వార్ ఎపిసోడ్స్ ని తీర్చి దిద్దేందుకు అన్ లిమిటెడ్ బడ్జెట్లు ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. ఇంతకుముందు హాలీవుడ్ ని చూసి బాలీవుడ్ వాతలు పెట్టుకునేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ .. బాలీవుడ్ ని మించిన సాహసం ఒక ప్రాంతీయ భాషా పరిశ్రమ అయిన టాలీవుడ్ లో జరుగుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. మన ఫిలింమేకర్స్ సాహసం గురించి.. రాజీ అన్నదే లేని తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే.అయినా ఇంత భారీ బడ్జెట్లు పెడుతున్నారంటే?  పాన్ ఇండియా లుక్ కోసమే అనడంలో సందేహం లేదు.  కాస్ట్యూమ్స్ కి సంబంధించిన భారీ బడ్జెట్లు వెచ్చిస్తున్నారు. ఎంచుకున్న కథాంశాన్ని బట్టి విజువల్ రిచ్ కాస్ట్యూమ్స్ ని తెచ్చేందుకు మన మేకర్స్ ఏమాత్రం వెనకాడడం లేదు. బడ్జెట్ ఎంత ఖర్చవుతుందని తెలిసినా పెట్టేందుకు ముందుకొస్తున్నారు. అసలు తెలుగు సినిమా హిస్టరీని బాహుబలి ముందు.. బాహుబలి తర్వాత డివైడ్ చేసి చూడాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్.. ఇండియన్ సినిమా పురోభివృద్ధికే కొత్త దారి చూపిన గ్రేట్ మూవీగా బాహుబలి రికార్డులకెక్కింది.

ఇక భారీతనం నిండిన కాస్ట్యూమ్స్ అనగానే అసలు కథ బాహుబలితోనే మొదలైంది. ఈ సినిమా కోసం జక్కన్న సతీమణి రమా రాజమౌళి బాలీవుడ్ కాస్ట్యూమర్స్ తో కలిసి విజువల్ రిచ్ కాస్ట్యూమ్స్ ని తయారు చేశారు. అవసరం మేర హాలీవుడ్ టెక్నాలజీని- టెక్నిక్ ని అడాప్ట్ చేసుకుని తెరపై పాత్రధారుల లుక్ ని తీర్చిదిద్దారు. బాహుబలి కాస్ట్యూమ్స్ లో ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి- భళ్లాల దేవ- కట్టప్ప- శివగామి- దేవసేన- అవంతిక కాస్ట్యూమ్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. రాజులు- రాజ్యాలు- కోటలు-గడీలు వీటికి తగ్గట్టే యాప్ట్ కాస్ట్యూమ్స్ ని తయారు చేసేందుకు ఆర్కా మీడియా సంస్థ రాజీ అన్నదే లేకుండా ఖర్చు చేసింది. బాహుబలి 1 - 2 కాస్ట్యూమ్స్ కోసం కోట్లలో ఖర్చు చేశామని అప్పట్లో మీడియా ఇంటర్వ్యూల్లో ప్రభాస్- రాజమౌళి బృందం వెల్లడించారు.

ఇటీవలే రిలీజైన `సాహో`కి ఉపయోగించిన ఖరీదైన కాస్ట్యూమ్స్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. ప్రభాస్ తో పాటు విలన్ గ్యాంగ్ లు టూకాస్ట్ లీ డ్రెస్ లు తొడిగారు. కేవలం విదేశాల్లో మాత్రమే లభించే ఖరీదైన కోట్ లు.. లెదర్ జర్కిన్లు.. ఉలెన్ డ్రెస్ లు- సూట్ లతో మోతెక్కించారు. ఈ భారీతనం నిండిన కాస్ట్యూమ్స్ వల్లనే ప్రతి ఫ్రేమ్ కి లుక్ వచ్చిందనడంలో సందేహం లేదు. కోట విజయ భాస్కర్ సాహో చిత్రానికి కాస్ట్యూమ్స్ అందించారు. ఈ కాస్ట్యూమ్స్ కోసమే కోట్లలో ఖర్చే చేశారని ఆయన తెలిపారు.

సైరా నరసింహారెడ్డికి అదే రేంజ్ కాస్ట్యూమ్స్ తెర నిండుగా కన్నుల పండుగ చేయబోతున్నాయని ఇప్పటికే రిలీజైన పోస్టర్లు- టీజర్ - మేకింగ్ వీడియోలతోనే అర్థమైంది. గ్లాడియేటర్.. ట్రాయ్.. వార్ ఆఫ్ ది యారోస్ రేంజ్ కాస్ట్యూమ్స్ ని ఈ చిత్రానికి డిజైన్ చేశారని ఇప్పటికే రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి. ఉయ్యలవాడ నరసింహారెడ్డి పాత్రకు అద్భుతమైన కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేశారు. ఓవైపు బంధిపోటు గెటప్ .. మరోవైపు మహా రాజు గెటప్ తో చిరంజీవి ఫోటోలు అంతర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇతర కీలక పాత్రలకు విజువల్ రిచ్ కాస్ట్యూమ్స్ ని తీర్చిదిద్దారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టంట్ మన్స్ (ఆంగ్లేయుల పాత్రలు) పని చేశారు. వీళ్లకు అదే రేంజు కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేశారట. విదేశాల్లో ప్రత్యేకించి సిల్క్ క్లాత్ ని కొని ఆంగ్లేయుల దుస్తుల్ని డిజైన్ చేశారు. సైరాకి 22 మంది ట్రైలర్లు పని చేశారని కళాదర్శకుడు రాజీవన్ వెల్లడించారు. ఇక కాస్ట్యూమ్స్ డిపార్ట్ మెంట్ ని మెగా వారసురాలు సుశ్మిత కోఆర్డినేట్ చేయడంతో విజువల్ రిచ్ అప్పియరెన్స్ లో ఎక్కడా రాజీకి రాలేదని అర్థమవుతోంది.

భారీతనం నిండిన వెరైటీ కాస్ట్యూమ్స్ అంటే హాలీవుడ్ చిత్రాలే గుర్తుకొస్తాయి. హాలీవుడ్ లో ఎన్నో చారిత్రాత్మక చిత్రాలు.. భారీ యాక్షన్ చిత్రాలు వచ్చాయి. వాటన్నిటా కాస్ట్యూమ్స్ మైమరిపిస్తుంటాయి. తెరపై చూస్తున్నంతసేపూ కళ్లు వాటికి అతుక్కుపోతాయంటే అతిశయోక్తి కాదు. సరిగ్గా ఇదే కల్చర్ ని బాలీవుడ్ ఎప్పుడో ఎడాప్ట్ చేసుకుంది. అక్కడ స్టార్ డైరెక్టర్ కం కళాత్మక దర్శకుడు భన్సాలీ ఎప్పుడో పరిచయం చేసిన కల్చర్ ఇది. జోధా అక్భర్- గుజారిష్- తాళ్- రామ్ లీల- పద్మావత్- వీటన్నిటా భారీ కాస్ట్యూమ్స్ కళ్లకు మిరుమిట్లు గొలుపుతాయి. అలాగే ఇండియన్ సూపర్ హీరో హృతిక్ నటించిన క్రిష్- బ్యాంగ్ బ్యాంగ్ - వార్ చిత్రాల కాస్ట్యూమ్స్ వ్వావ్ అనిపించాయి. ఇప్పుడు టాలీవుడ్ లో భారీ స్పాన్ సినిమాలతో మన మేకర్స్ సాహసాలు చేస్తున్నారు. విజువల్ రిచ్ నెస్ తో పాటు కాస్ట్యూమ్స్ విషయంలోనూ  మనవాళ్లు ఏమాత్రం రాజీకి రావడం లేదు. ఒక ప్రాంతీయ భాష పరిశ్రమకు ఇంత ధైర్యమా? సరిహద్దులు చెరిపేసే సాహసమా? ఎన్ని గుండెలు? అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. మనోళ్లకు సాహో అనాల్సిందే.