Begin typing your search above and press return to search.

మైనింగ్ కింగ్ గాలి జనార్థ‌న్ రెడ్డి బ‌యోపిక్

By:  Tupaki Desk   |   8 Dec 2019 5:30 PM GMT
మైనింగ్ కింగ్ గాలి జనార్థ‌న్ రెడ్డి బ‌యోపిక్
X
బ‌ళ్లారి మైనింగ్ దిగ్గజం.. రాజకీయ నాయకుడు గాలి జనార్థన్ రెడ్డి బ‌యోగ్ర‌ఫీ వీడియోలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న జీవితంపై ఇన్నాళ్లు యూట్యూబ్ లో డాక్యుమెంట‌రీలు.. హాఫ్ నేరేటెడ్ స్టోరీలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. బ‌ళ్లారి మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి జీవిత‌క‌థ‌తో బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడెవ‌రు? అన్న‌దానిపై పూర్తి స‌మాచారం రివీల్ కావాల్సి ఉంది.

గాలి జనార్ధన్ రెడ్డి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయ‌కుడు. కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరు. అతను బళ్లారి జిల్లా బిజెపి అధ్య‌క్షుడుగా పనిచేశాడు. 2006 లో ఆయన శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. బి.ఎస్. యడ్యూరప్ప మంత్రివర్గంలో టూరిజం కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బళ్లారి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కుంభకోణంలో చిక్కుకుని జైలుకు వెళ్లారు. జనార్ధన రెడ్డికి ఇద్దరు సోదరులు కరుణాకర రెడ్డి- సోమశేఖర రెడ్డి.. ఒక సోదరి రాజేశ్వరి ఉన్నారు. కుటుంబీకులంతా పారిశ్రామికవేత్తలు. బళ్ళారి జిల్లాలోని స్థానిక ప్రభుత్వాన్ని ఆధిపత్యం వహించే రాజకీయ నాయకులుగా ఎదిగారు. రాష్ట్రంలో అత్యంత ధనవంతులైన ఇనుము ధాతువు నిక్షేపాలు కలిగిన భూస్వాములుగానూ పేరుంది.

1999 లో జరిగిన లోకసభ ఎన్నికలలో రెడ్డి సోదరులు సోనియా గాంధీ పై బళ్లారిలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన సుష్మా స్వరాజ్ కోసం ప్రచారంలో పనిచేసినప్పుడు జనార్ధన రెడ్డి బాగా వెలుగులోకి వచ్చారు. స్వరాజ్ ఓడిపోయినా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఉన్నారు. సుష్మా స్వరాజ్ బళ్లారిని తరచూ సందర్శించేవారు. అయితే, మైనింగ్ కుంభకోణం మొదలయ్యింది మరియు రెడ్డి సోదరులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో సుస్మా స్వ‌రాజ్ అవ‌కాశ‌వాద రాజ‌కీయం బ‌య‌ట‌ప‌డింది.

2001లో బిజెపి మొదటిసారి బళ్లారిలో స్థానిక మున్సిపల్ ఎన్నికలను గెలుచుకుంది. 2004 లో కర్నాటక చరిత్రలో మొదటిసారి బిజెపి ఎంపీ ..బిజెపి ఎమ్మెల్యేలు బళ్లారి నుండి గెలిచారు. 2005 లో బిజెపి మొదటిసారి బళ్లారీలో జిల్లా పరిషత్ ఏర్పాటు చేసింది. వరుసగా మూడుసార్లు విజయం సాధించింది. బిజెపి ఎంపీ సీట్లపై వరుసగా 3 సార్లు నిరంతరాయంగా గెలుపొందగా.. జనార్ధన రెడ్డి రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2006 లో బిజెపి-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని జనార్ధన రెడ్డి - బి. శ్రీరాములు ప్రయత్నాలతో కేబినెట్ మంత్రిగా నియమించారు. 2006 లో జనార్దనా రెడ్డి తన చురుకైన పాత్ర కోసం ఎమ్మెల్సీ అయ్యారు. తరువాతి రోజు ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామికి వ్యతిరేకంగా పోరాడారు. ఆరోపణలు చేస్తూ.. బిజెపి పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఒక అవినీతి రాజకీయ నాయకుడని హెచ్.డి కుమారస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇచ్చారు. బి.ఎస్.యడ్యూరప్పతో పాటు 2008 లో అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ప్రచారం చేశారు. బిజెపి ఒక పెద్ద పార్టీగా 110 సీట్లతో ఆవిర్భవించింది. మరోసారి గాలి చొరవతో 5 స్వతంత్ర ఎమ్మెల్యే బిజెపి మద్దతుతో దక్షిణాదిలో ప్రభుత్వం ఏర్పడింది. దాంతో ఆయ‌న పర్యాటకం.. ఇన్ ఫ్రా మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు.

పారిశ్రామిక వేత్తగా ఆయ‌న ప్ర‌స్థానం ఎంతో గొప్ప‌ది. కడపలోని వెనుకబడిన జిల్లాలో బ్రహ్మని ఇండస్ట్రీస్ స్టీల్ ఉత్ప‌త్తి ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసిన గాలి జనార్ధన్ రెడ్డి 10వేల‌ మందికి ప్ర‌త్య‌క్షంగా.. పరోక్షంగా ఎంద‌రికో ఉపాధి కల్పించాలని తలచారు. గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబం.. వారి గ్రూప్ కంపెనీలు బ్రహ్మాని ఇండస్ట్రీస్ కి ప్రధాన ప్రమోటర్లు. బ్రహ్మాని ఇండస్ట్రీస్ స్థాపించటం కూడా కడప జిల్లా వెనుకబడిన ఆ ఏరియా అబివృద్ధికి ఒక మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన గాలి జనార్ధన్ రెడ్డి ఉపాధి కల్పించాలని భావించారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న‌పై అక్ర‌మ మైనింగ్ కేసులు హీటెక్కించాయి. బళ్లారి ప్రాంతంలోని ఈ ఇనుము ధాతువు చట్టవిరుద్ధంగా ప్రభుత్వానికి అతి తక్కువ రాయల్టీలు చెల్లించిన తరువాత అక్రమంగా ఖ‌నిజాల్ని త‌ర‌లించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. జనార్ధన రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా అటవీ భూములను ఆక్రమించ‌డం.. ఇనుప ఖనిజం మార్కెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర గనుల రాయల్టీలు భారీగా చెల్లించటం వివాదాల‌కు కార‌ణ‌మైంది.

2009 లో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నియమించిన సెంట్రల్ సాధికారత కమిటీ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి వ్యతిరేకంగా చర్య తీసుకుంది.మైనింగ్ కుంభకోణాల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ లోని చంచల్ గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాలి దగ్గర నుంచి రెండు హెలికాఫ్టర్లు, రూ. 10 కోట్ల రెండు లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేశారు. కేసులో ఎఫ్.ఐ.ఆర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసింది. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ హైదరాబాద్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ వి వి గాలి జనార్దనరెడ్డి అరెస్టు చేయడం ఆంధ్ర సరిహద్దు దాటి కర్ణాటకలో కూడా మైనింగ్ తవ్వకాలు జరిపార‌నే ఆరోప‌ణ‌ల‌పై గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి దాదాపు 4 సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష అనుభ‌వించి బెయిల్ పై విడుద‌ల‌య్యారు. ప్ర‌స్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఒక బ‌యోపిక్ కి ఇంత‌కంటే ఎమోష‌న్ .. మ‌సాలా ఉన్న క‌థాంశం ఇంకేం ఉంటుంది? బ‌యోపిక్ ల ట్రెండ్ లో ఆయ‌న బ‌యోపిక్ స‌న్నాహాలు ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారింది.