టాలీవుడ్ డ్రగ్స్ కేసు: కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారా?

Wed Dec 08 2021 17:08:00 GMT+0530 (IST)

Tollywood Drugs Case comes to an end

2017 లో టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో.. గత నాలుగేళ్లలో ఎన్నో ట్విస్టులు టర్న్ లు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిట్ దర్యాప్తుతో మొదలుపెట్టి.. అనేక మలుపుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వరకు వచ్చింది.అయితే డ్రగ్స్ దిగుమతి నిధుల మళ్లింపు పై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును మూసివేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

తెలంగాణా ఆబ్కారీ పోలీసులు నాలుగేళ్ళ క్రితం కెల్విన్ మార్కెరాన్స్ అనే డ్రగ్ సప్లయిర్ ని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం తెర మీదకు వచ్చింది.

విచారణలో కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు పలువురు టాలీవుడ్ ప్రముఖులను ఎంక్వైరీ చేశారు. వీరి నుంచి గోళ్లు తల వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపించారు.

అయితే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ మాధకద్రవ్యాల క్రయ విక్రయాల్లో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) మరియు మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది.

పూరీ జగన్నాధ్ - ఛార్మి కౌర్ - రానా దగ్గుబాటి - రవితేజ - రకుల్ ప్రీత్ సింగ్ - ముమైత్ ఖాన్ - తరుణ్ - తనీష్ - నందు - నవదీప్ సహా 12మందికి నోటీసులు జారీ చేసి విచారించారు.

ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సాగిన డ్రగ్స్ కేసు విచారణలో.. ప్రధాన నిందితుడు కెల్విన్ తో ఉన్న సంబంధాలపై ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆరా తీశారు.

ఈ కేసులో సినీ ప్రముఖుల ప్రమేయం ఎంత? రాబోయే రోజుల్లో వీరిని అరెస్ట్ చేసి అవకాశం ఉందా? అని అప్పట్లో ఇండస్ట్రీలో అందరూ చర్చించుకున్నారు. అయితే ఈ కేసు ఇప్పుడు మరో టర్న్ తీసుకుందని తెలుస్తోంది.

డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు ఈడీ ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించకపోవడంతో చివరికి ఈ కేసును మూసేయాలని అధికారులు నిర్ణయించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. కేసును క్లోజ్ చేయడానికి ప్రస్తుతం ఈడీ అధికారులు చట్టపరమైన ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారట.

ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ ప్రముఖులందరూ ఊపిరి పీల్చుకున్నట్లే. డ్రగ్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని సెలబ్రిటీలు చెబుతూ వచ్చినా.. రెండుసార్లు విచారణ ఎదుర్కోవడంతో అందరూ నిజముందేమో అని ఆలోచించారు.

కానీ చివరకు వీరెవరికీ డ్రగ్స్ వ్యవహారంతో లింక్ లేదని నివేదిక ఇచ్చి కేసును మూసివేస్తారని అంటున్నారు. దీంతో అధికారులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.