కాస్త పేరున్న కథానాయికలకు కష్టకాలమే!

Fri Jul 30 2021 11:04:18 GMT+0530 (IST)

Hard Times For Tollywood Upcoming Actresses

కథానాయిక అంటే అందంగా ఉండవలసిందే .. ఎందుకంటే కథానాయిక అందమే సగటు ప్రేక్షకుడిని థియేటర్ కి తీసుకొస్తుంది. కథానాయిక అందానికి అంతటి ఆకర్షణ ఉంటుంది గనుకనే తెరపై హీరోకి ఎన్ని పనులున్నా .. ఎక్కడున్నా అరగంటకోసారి పరిగెత్తుకొచ్చి హీరోయిన్ తో ఓ పాట వేసుకోవలసిందే. లేదంటే ప్రేక్షకులు అసహనానికి లోనవుతారు .. ఇలా చేస్తే ఇంకోసారి రామంటూ అలిగేస్తారు. అందువలన అటు హీరోనే కాదు ..  ఇటు థియేటర్లోని ప్రేక్షకులను ఉత్సాహపరిచే బాధ్యత హీరోయిన్ కి ఎప్పుడో అప్పగించేశారు.హీరోయిన్ అందమే .. ప్రేక్షకుడి ఆనందానికి ప్రధమ ఔషధంగా మారిపోయింది. ప్రేక్షకులకు బోర్ కొట్టకూడదనే ఉద్దేశంతో  ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు తెరపై కథానాయికలు మరింత వేగంగా మారిపోతున్నారు. అనుష్క .. నయనతార .. కాజల్ .. తమన్నా తరువాత ఇక అంతకాలం కెరియర్ ను కొనసాగించడమనేది ఎవరికీ సాధ్యం కాదేమో అనిపిస్తోంది. అందుకు కారణం ఊహించనంత వేగంగా మారిపోతున్న పరిస్థితులనే చెప్పాలి.

చిన్న బడ్జెట్ సినిమాలు ఈ మధ్య కాలంలో మరింత పెరిగిపోతున్నాయి. ఈ తరహా సినిమాలతో ఎక్కువమంది కథానాయికలు పరిచయమవుతున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు పూర్తికావడానికి చాలా సమయాన్ని తీసుకుంటున్నాయి. వాళ్ల సరసన అవకాశాన్ని దక్కించుకునేవారిని వ్రేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక మీడియం బడ్జెట్ సినిమాలపైనే కాస్త పేరున్న హీరోయిన్లు ఆశపడాలి .. ఆధారపడాలి. ఇక్కడ కూడా వరుస సక్సెస్ లు ఉంటేనే మళ్లీ కనిపిస్తారు. లేదంటే వేరే ఇండస్ట్రీలో కనిపిస్తారు. అంతలా వాళ్ల కెరియర్ ప్రభావితమవుతూ ఉంటుంది.

లావణ్య త్రిపాఠి .. రెజీనా .. నివేదా థామస్ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. ప్రగ్యాజైస్వాల్ .. అనుపమ పరమేశ్వరన్ .. పాయల్ .. ఇలా ఇంకొందరు. వీళ్లందరూ కూడా అందం ఉన్నవారే .. అభినయం తెలిసినవారే .. హిట్టు అనే మాట విన్నవారే. వీరంతా ఒక స్థాయికి చేరుకుని అక్కడ కుదురుకుందామని అనుకునేలోగా అవకాశాలు తగ్గుతూ వచ్చినవారే. ప్రస్తుతం తమకి వస్తున్న అవకాశాలతో సరిపెట్టుకుంటున్నవారే. ఒక వైపున గోల్డెన్ లెగ్ సెంటిమెంట్ తో నలుగురు హీరోయిన్సే స్టార్ హీరోల సినిమాలను చుట్టబెట్టేస్తున్నారు. మరో వైపున చిన్న సినిమాలతో చాలామంది కొత్త హీరోయిన్లు పొలోమంటూ వచ్చేస్తున్నారు.

ఇప్పటికే కృతి శెట్టి వస్తూ వస్తూనే ఓ అరడజను ఆఫర్లను పట్టేసింది. ఆ తరువాత లైన్లో అనన్య పాండే .. కేతిక శర్మ .. మీనాక్షి చౌదరి వంటి కుర్రహీరోయిన్లు ఉన్నారు. హిట్టు దొరికితే చెలరేగిపోకుండా వాళ్లు ఊరుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో .. కెరియర్ ను మొదలుపెట్టేసి కొంతకాలమవుతున్న హీరోయిన్లు కష్టకాలాన్నే ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమా హిట్ అయితే కెరియర్ పుంజుకుంటుందేమో అనే ఆశతో కొంతమంది ఉంటే ఇక వెయిట్ చేయడం తమవలన కాదంటూ వెబ్ సిరీస్ ల వైపు వెళుతున్న వారు మరికొంతమంది. వీలైనంతవరకూ తమ సినిమా ద్వారా కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని ఎవరికివారు ఉత్సాహాన్ని చూపుతుండటమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు.