Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: మ‌న హీరోలు ప‌క్కా బిజినెస్ మైండెడ్!

By:  Tupaki Desk   |   15 Oct 2021 12:30 AM GMT
టాప్ స్టోరి: మ‌న హీరోలు ప‌క్కా బిజినెస్ మైండెడ్!
X
టాలీవుడ్ హీరోలు సినిమాల‌తో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో వ‌చ్చిన ఆదాయాన్ని ఇత‌ర వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టి భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ప‌లువురు ప‌క్కా బిజినెస్ మైండెడ్ అని నిరూపిస్తున్నారు. ఎంట‌ర్ ప్రెన్యూర్లుగా రాణిస్తున్నారు. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ జీఎంబీ బ్యాన‌ర్ ని స్థాపించి నిర్మాత‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏషియ‌న్ సంస్థ‌లతో కలిసి మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌ను నిర్మించి అక్క‌డా స‌క్సెస్ అయ్యారు. ఈ వ్యాపారాన్ని ఇత‌ర న‌గ‌రాల‌కు విస్త‌రించ‌నున్నారు. తాజాగా సూప‌ర్ స్టార్ క్లోత్స్ వ్యాపారంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. మ‌హేష్ త‌న పేరిట క్లాథింగ్ బ్రాండ్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే ఈ వ్యాపారాన్ని న‌మ్ర‌త చూసుకుంటున్నార‌ని తెలిసింది.

ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఇప్ప‌టికే స్థిర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అలాగే ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ .. ఇత‌ర‌ బిజినెస్ ల్లో కూడా రాణిస్తున్నారు. చిరు-చ‌ర‌ణ్ బృందం విశాఖ‌లో ఫిలింస్టూడియోల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ క‌థ‌నాలొచ్చాయి. దానిపై మ‌రింత స్ప‌ష్ఠత రావాల్సి ఉంటుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్ప‌టి నుంచి హైద‌రాబాద్ లో ప‌బ్ లు నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ రంగంలో బ‌న్నీ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అమీర్ పేట స‌త్యం థియేట‌ర్ స్థ‌లంలో ఏఏఏ బ్రాండ్ పేరుతో ఓ మ‌ల్టీప్లెక్స్ నే ప్ర‌స్తుతం నిర్మిస్తున్నారు. అది మంచి ప్రైమ్ ఏరియా కావ‌డంతో తిరుగులేని వ్యాపార సంస్థ‌గా ఎద‌గ‌డం ఖాయం. బాస్ అల్లు అర‌వింద్ - బ‌న్ని- శిరీష్ బృందం ఇప్ప‌టికే ఆహా ఓటీటీని ప్రారంభించి పెద్ద స‌క్సెస్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇవేగాక హైద‌రాబాద్ ఔట‌ర్ లో సినిమా స్టూడియో నిర్మాణం చేప‌డుతున్నారు. మునుముందు విశాఖ‌లోనూ సినిమా స్టూడియోల నిర్మాణానికి శ్రీ‌కారం చుడ‌తార‌ని తెలిసింది.

డార్లింగ్ ప్ర‌భాస్ తన స్నేహితుల‌తో క‌లిసి ఇప్ప‌టికే సినిమా థియేటర్లు మ‌ల్టీప్లెక్స్ నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. ఇక సీనియ‌ర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున‌ ఎప్ప‌టి నుంచో బిజినెస్ పార్ట‌న‌ర్స్ అని తెలిసిందే. ఈ జోడీ క‌లిసి చాలా వ్యాపారాలు చేసి స‌క్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ ప్రారంభించి దాన్ని స‌క్సెస్ చేయ‌డంలో ఈ ద్వయానికి తిరుగులేదని నిరూపించారు. న‌ష్టాల్లో ఉన్న సంస్థ‌ని కొనుగోలు చేసి భారీ లాభాల బాట ప‌ట్టించి మ‌రో కార్పోరేట్ సంస్థ‌కు అమ్మారు. త‌ద్వారా ఇద్ద‌రికి వంద‌ల‌ కోట్ల ఆదాయం వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు రేసింగ్ కంపెనీతో పాటు.. ఫుట్ బాల్ టీమ్ ల‌ను కూడా ఓన్ చేసుకున్నార‌ని తెలిసింది. కింగ్ నాగార్జున స్వ‌త‌హాగానే గొప్ప వ్యాపారి. విదేశాల్లో హోట‌ల్ రంగంలోనూ .. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ ల‌లోనూ.. ప‌బ్ ల నిర్వ‌హ‌ణ‌లోనూ నాగ్ కి ఒక బ్రాండ్ ఉంది. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య కూడా వ్యాపారాల్లో త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స‌మాచారం. స‌మంత కూడా సొంత వ్యాపారాల నిర్వ‌హ‌ణ‌లో బిజీ అయ్యారు.

ఇటీవ‌లే విజ‌య్ దేర‌కొండ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఏషియ‌న్ ఫిల్మ్స్ తో ఓ మ‌ల్టీప్లెక్స్ ని నిర్మించి ఇటీవ‌లే లాంచ్ చేసాడు. ఇంత‌కుముందు రౌడీ బ్రాండ్ పేరుతో రౌడీ స్టార్ కూడా బట్ట‌ల వ్యాపారంలోకి దిగాడు. అక్క‌డా కూడా భారీగా లాభాలు వ‌చ్చేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్న‌ట్లు ఆయ‌న సన్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. శ‌ర్వానంద్ స‌హా ప‌లువురు యువ‌క‌థానాయ‌కులు హోట‌ల్ వ్యాపారాల్లో ఉన్నార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కూడా హోట‌ల్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టారు. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత స‌హా ప‌లువురు నిర్మాత‌లు హైవేల్లో దాబా హోట‌ల్ రంగంలో ఉన్నారు.