Begin typing your search above and press return to search.

టికెట్ పెరిగినా త‌గ్గినా కంటెంట్ ఉన్నోళ్ల‌కే మేలు!

By:  Tupaki Desk   |   22 May 2022 5:30 AM GMT
టికెట్ పెరిగినా త‌గ్గినా కంటెంట్ ఉన్నోళ్ల‌కే మేలు!
X
క‌టౌట్ ఉండి కంటెంట్ లేక‌పోయినా.. కంటెంట్ ఉండి క‌టౌట్ మిస్స‌యినా బాక్సాఫీస్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం. కొన్ని సినిమాల‌కు హీరోలే క్రౌడ్ పుల్ల‌ర్స్ అని నిరూపిస్తున్నారు. మ‌రికొన్ని సినిమాల విష‌యంలో అలా జ‌ర‌గ‌డం లేదు. హీరో క్రౌడ్ పుల్ల‌ర్ అయినా కానీ కంటెంట్ మిస్స‌యితే డిజాస్ట‌ర్ అని ప్రూవ్ చేసిన సినిమాలు ఎన్నో. ఇటీవ‌ల విడుద‌లైన ఆచార్య కూడా ఈ త‌ర‌హా లో ఒక ఉదాహ‌ర‌ణ‌.

ఇక‌పోతే ఆచార్య చిత్రం చూసేందుకు జ‌నం థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డానికి టికెట్ ధ‌ర‌ల పెంపు కూడా ఒక బ‌ల‌మైన కార‌ణం అన్న‌ది దిల్ రాజు స‌హా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు విశ్లేషించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్ లాంటి అగ్ర హీరోలు న‌టించినా ఈ మూవీ థియేట‌ర్ల‌ను జ‌నాల‌తో పుల్ చేయ‌లేక‌పోయిందని విమ‌ర్శ‌లొచ్చాయి. ఇది దారుణ వైఫ‌ల్యం అంటూ విమ‌ర్శించిన వారున్నారు.

దీనిపై దిల్ రాజు కూడా స్పందించారు. ధ‌ర‌ల పెంపు స‌రికాద‌ని భావించి ఇక‌పై త‌న ఇత‌ర సినిమాల‌ విడుద‌ల‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అంతేకాదు.. ఏపీ టీఎస్ లోనూ పెరిగిన టిక్కెట్ ధరలకు అందరూ తనను నిందించారని దీనికి తానొక్క‌డినే కార‌ణం కాద‌ని అగ్ర‌ నిర్మాత దిల్ రాజు బహిరంగంగా అంగీకరించారు. అదే సమయంలో ప్రేక్షకులు థియేటర్లలో మాత్రమే సినిమాను పదే పదే చూడాలని కోరుకుంటున్నందున త‌దుప‌రి రిలీజ్ అయిన `ఎఫ్ 3` టిక్కెట్ల పెంపు కోసం దరఖాస్తు చేయడం లేదని ఆయ‌న‌ తెలిపారు. కొన్నాళ్ల‌ క్రితం మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో అగ్ర హీరోలు స‌హా దిల్ రాజు కూడా టికెట్ పెంపుపై నిన‌దిస్తూ ప్ర‌భుత్వాన్ని క‌లిసారు. రాజ‌మౌళి స‌హా ప‌లువురు సినీపెద్ద‌లు ఈ ఉద్య‌మానికి అండ‌గా నిలిచారు.

చివ‌రికి ఏపీ ప్ర‌భుత్వం దిగొచ్చి టికెట్ పెంపున‌కు అంగీక‌రించింది. కానీ ఈ పెంపుద‌ల ఆచార్య చిత్రంపై పెద్ద పంచ్ వేసింద‌ని త‌ర్వాత విశ్లేషించిన దిల్ రాజు దానిని బ‌హిరంగంగా అంగీక‌రించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే ఆచార్య పై చూపిన ప్ర‌భావం RRR- KGF 2 చిత్రాల‌పై ఎందుక‌ని చూప‌లేదు? అంటూ విశ్లేషిస్తున్నారు. చివ‌రికి టికెట్ పెంపులో ఆ రెండు సినిమాల‌తో పాటు రాధేశ్యామ్ వంటి చిత్రానికి మేలు జ‌రిగిందే కానీ కీడు జ‌ర‌గ‌లేదు. కానీ ఆచార్య విష‌యంలో అదే పెంపుద‌ల‌ పెద్ద మైన‌స్ అయ్యింది. ఇక టికెట్ పెంపు జీవో రావ‌డంలో కృషి చేసిన చిరు దీనిపై ఏమ‌ని అంటారు? అంటూ ఒక వ‌ర్గం ప్ర‌శ్నించ‌డం ప్రారంభించింది.

ఒక‌వేళ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో కొన్ని నిర్ణ‌యాలు అతివృష్టి అనావృష్టిలా ఉండ‌డం కూడా స‌మ‌స్య‌కు కార‌ణం కావొచ్చు. రూ.5 కే అమ్మాల్సిన స‌మోసాను ఏకంగా రూ.10 కి అమ్మితే ఎవ‌రైనా కొంటారా? రూ.6 లేదా రూ.7కి పెంచితే అది కొంత‌వ‌ర‌కూ న్యాయం. కానీ ఇప్పుడు అంద‌రూ రూ.10కే అమ్మాల‌నుకుంటున్నారు. కొంద‌రైతే అత్యాశ‌కు పోయి జీఎస్టీ అంటూ రూ.15 కి కూడా అమ్మేస్తున్నారు.

ఇదే స‌మోసాని మ‌ల్టీప్లెక్స్ లో అయితే రూ.60 లేదా రూ.100 కి అమ్ముతున్నారు. మ‌నిషి అత్యాశ‌కు న‌మూనా ఇది. ఇలాంట‌ప్పుడు ప్రేక్ష‌కులు ఆ స‌మోసాని కొనుక్కునే తినాలా ? అనే డైల‌మాలో ప‌డిపోతున్నారు! ఇది ఎప్ప‌టికీ ఎండ్ లెస్ గానే కొన‌సాగుతోంది. ఇక టికెట్ పెంపుద‌ల‌కు కూడా ఇలాంటి ఫార్ములానే వ‌ర్తిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. క‌రోనా క్రైసిస్ తో అల్లాడిన జ‌నాలు చెత్త సినిమాల కోసం థియేట‌ర్ల‌కు వెళ్లే మూడ్ లో లేరు. చెత్త స‌మోసాల జోలికి వెళ్లే మూడ్ త‌గ్గించుకున్నారు. సెల‌క్టివ్ గా కొన్నిటికే వెళ‌తారు. న‌చ్చిన‌వే తింటున్నారు. హిట్టొచ్చిన వాళ్లు ఇప్పుడు అదృష్ట‌వంతులు.