'ఆచార్య'లో అంతమంది హీరోయిన్లా...?

Thu Jul 16 2020 17:40:40 GMT+0530 (IST)

Like so many heroines in 'Acharya' ...?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాకు కీలక పాత్రలో నటించనున్నాడు. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాలు.. ప్రభుత్వ భూముల కబ్జాలు తదితర అంశాలతో సందేశాత్మకంగా ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. కొరటాల శివ స్టైల్ లోనే సామాజిక అంశాలకు కమర్షియాలిటీ జోడించి ఈ సినిమాని రూపొందిస్తున్నారట. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. 'ఆచార్య'లో రెజీనా కాసాండ్రా కూడా ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా కరోనా మహమ్మారి ప్రభావం వలన నిలిచిపోయింది.ఇదిలా ఉండగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా 'ఆచార్య'లో అతిధి పాత్రలో కనిపించనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతేడాది మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన తమన్నా 'ఆచార్య' సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేయడానికి అంగీకరించిందట. అయితే సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న 'ఆచార్య'లో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ కి ఏమాత్రం ప్రాధాన్యత ఉంటుందో చూడాలి. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా రామ్ చరణ్ కి జోడీగా కనిపించనుందా లేదా చిరుతో స్టెప్పులేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా ప్రస్తుతం గోపీచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ తో కలిసి నటించిన 'భోలే చుడియన్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.