'థోర్: లవ్ అండ్ థండర్' తెలుగు ట్రైలర్ చూశారా..?

Tue May 24 2022 16:22:15 GMT+0530 (IST)

Thor Love and Thunder trailer

సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందించే ఈ చిత్రాలు ఇండియాలోనూ మంచి ఆదరణ దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంటాయి.ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న మార్వెల్ సూపర్ హీరో క్యారెక్టర్ లలో థోర్ ఒకటి. ఈ సూపర్ హీరో సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఈ సిరీస్ లో ఇప్పుడు ''థోర్: లవ్ అండ్ థండర్'' అనే నాలుగో సినిమా రాబోతోంది.
 
“థోర్: లవ్ అండ్ థండర్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2022 జులై 8న విడుదల కాబోతోంది. ఇందులోనూ థోర్ గా క్రిస్ హేమ్స్ వర్త్ అలరించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ రిలీజ్ అవ్వగా.. లేటెస్టుగా మార్వెల్ స్టూడియోస్ ట్రైలర్ ను ఆవిష్కరించింది.

'పిల్లకాయలూ.. ఇప్పుడు మీరు పాప్ కార్న్ తింటూ కూర్చోండి.. మీకిప్పుడు అంతరిక్ష యోధుడు థోర్ ఓడిన్సన్ కథ చెప్తాను' అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో థోర్ కి తోడుగా అతని మాజీ ప్రేయసీ జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్ మన్) లేడీ థోర్ గా అలరించింది.

థోర్ గాడ్ ఆఫ్ థండర్ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే గోర్ ది గాడ్ బుట్చేర్ (క్రిస్టియన్ బాలే) అనే గెలాక్సీ కిల్లర్.. దేవుళ్ళను అంతం చేయాలని అనుకోవడంతో.. థోర్ కు మళ్ళీ తన ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కింగ్ వాల్కైరీ (టెస్సా థాంప్సన్) - కోర్గ్ మరియు మాజీ ప్రియురాలు లేడీ థోర్ సహాయంతో థోర్ తన ప్రపంచాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా కథాంశంని తెలుస్తోంది. ఎప్పటిగాలే ఇందులో థోర్ క్యారక్టర్ ఫన్నీగా.. అవసరమైన వీరోచిత పోరాటాలు చేసే విధంగా డిజైన్ చేయబడింది.

ట్రైలర్ చివర్లో నీ ముసుగు తొలగుస్తాను అంటూ థోర్ ను నగ్నంగా నిలబెట్టే సీన్ నవ్వులు పూయిస్తోంది. ఆధ్యంతం ఆకట్టుకున్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. “థోర్: లవ్ అండ్ థండర్” చిత్రానికి ఆస్కార్ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు. ఆయన అంతకుముందు ఇదే సిరీస్ లో 'థోర్: రాగ‍్నరోక్' చిత్రాన్ని తెరకెక్కించారు.

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘థోర్’ సిరీస్ లో నాలుగో చిత్రాన్ని మనదేశంలో ఇంగ్లీష్ - హిందీ - తమిళం - తెలుగు - కన్నడ - మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.