ఇప్పటికైతే రాబోయే క్రేజీ సినిమాల షెడ్యూల్ ఇదే..!

Tue Sep 14 2021 16:09:07 GMT+0530 (IST)

This is the schedule of upcoming crazy movies

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత జనాలు మెల్లమెల్లగా థియేటర్లకు రావడం ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకు చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నా.. కంటెంట్ బాగున్న సినిమాలను కరోనాని కేర్ చేయకుండా ఆదరిస్తున్నారు. వినాయక చవితి పండుగ నుంచి పెద్ద సినిమాలు కూడా థియేటర్లకు క్యూ కడతాయని అందరూ భావించారు. అయితే పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో సెప్టెంబర్ 24 నుంచి క్రేజీ మూవీస్ థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి.ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన మోస్ట్ అవైటెడ్ మూవీ ''లవ్ స్టోరీ'' ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఈ చిత్రం ఊపు తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వినాయక చవితికి వచ్చిన 'సీటీమార్' సినిమా కూడా మంచి వసూళ్ళు రాబడుతుండటంతో.. 'లవ్ స్టోరీ' పై అందరూ నమ్మకంతో ఉన్నారు.

ఇదే క్రమంలో మెగా హీరో సాయి తేజ్ - 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ''రిపబ్లిక్'' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నివేశాలు చేస్తున్నారు. ఇక చాన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని.. ఈసారి దసరా బరిలో దిగడానికి రెడీ అయ్యాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ వారు ప్రకటించారు.

అయితే అఖిల్ కు పోటీగా మరో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా వస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేసిన ''కొండపొలం'' చిత్రాన్ని అక్టోబర్ 8న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో దసరా హాలిడేస్ ని క్యాష్ చేసుకోడానికి శర్వానంద్ - సిద్ధార్థ్ ల ''మహాసముద్రం'' కూడా థియేటర్లలోకి రాబోతోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీని అక్టోబర్ 14న విడుదల చేయనున్నారు.

ప్రస్తుతానికైతే దసరా వరకు థియేటర్లలోకి రాబోయే సినిమాల షెడ్యూల్ ఇదే. బాలకృష్ణ - బోయపాటి శ్రీను 'అఖండ' - దిల్ రాజు ఫ్యామిలీ హీరో 'రౌడీ బాయ్స్' చిత్రాలు కూడా అక్టోబర్ లో వస్తాయని అంటున్నారు కానీ.. ఇంతవరకు రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రాలేదు. ఏదేమైనా సెప్టెంబర్ 17వ తేదీని వదిలేసి.. ఆపై వచ్చే వారం నుంచి వరుసగా క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఖాళీగా ఉన్న సెప్టెంబర్ 17న అనేక చిన్న చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ' చిత్రానికి మాత్రమే బజ్ ఉంది. మరి ఈ నాలుగు వారాల గ్యాప్ లో వచ్చే సినిమాల్లో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.