'బాహుబలి' తర్వాత ప్రభాస్ చిత్రాల్లో కామన్ ఫ్యాక్టర్ ఇదే..!

Tue Oct 04 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

This is the common factor in Prabhas films after Baahubali

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' ప్రాంఛైజీతో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. అయితే ఆ ఇమేజ్ ను కాపాడుకునే క్రమంలో డార్లింగ్ చేసిన రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు 'ఆదిపురుష్' సినిమాపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' మరియు 'రాధేశ్యామ్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టి తన సత్తా చాటాల్సిన పరిస్థితుల్లో ''ఆది పురుష్'' సినిమాతో వచ్చే సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఇక్కడ ప్రభాస్ నటించిన సినిమాలకు సంబంధించి కామన్ పాయింట్ ఏంటంటే.. బాలీవుడ్ కు చెందిన టీ-సిరీస్ సంస్థ మరియు టాలీవుడ్ యూవీ క్రియేషన్స్ అసోసియేషన్ అవ్వడమే. 'సాహో' 'రాధేశ్యామ్' మరియు 'ఆదిపురుష్' సినిమాలన్నింటిలో ఈ బ్యానర్లు పాలుపంచుకున్నాయి.

యూవీ మరియు టీ సిరీస్ సంస్థలు కలిసి నిర్మించిన సాహో - రాధే శ్యామ్ లు ఎలా నిరాశపరిచారో మనందరికీ తెలుసు. ఇప్పుడు 'ఆది పురుష్' సినిమాని టీ సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. యూవీ బ్యానర్ లో తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

''ఆది పురుష్'' సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మిశ్రమ స్పందన వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ మరియు టీ సిరీస్ కలిసి వరల్డ్ క్లాస్ మైథలాజికల్ విజువల్ వండర్ ని అందిస్తారు అనుకుంటే.. ఓ యానిమేటెడ్ కార్టూన్ ఫిల్మ్ ని ఇస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ని పెట్టుకొని అసలు ఇలాంటి వీడియో గేమ్ తరహా సినిమా చేయడం ఏంటని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. కనీసం ముందు నుంచే ఇలాంటి సినిమాతో రాబోతున్నట్లు మేకర్స్ ప్రచారం చేసినా ఇంతటి ట్రోలింగ్ ఉండేది కాదని అభిప్రాయ పడుతున్నారు.

'బాహుబలి' తరవాత వచ్చిన రెండు సినిమాలను తగిన విధంగా ప్రమోట్ చేయలేదని.. ఇప్పుడు 'ఆది పురుష్' విషయంలోనూ అలానే వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభాస్ మళ్లీ ఈ బ్యానర్లలో సినిమా చేయకుండా ఉంటే బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ప్రభాస్ ఆల్రెడీ అదే బ్యానర్లలో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న 'స్పిరిట్' చిత్రాన్ని టీ సిరీస్ వారే బ్యాంక్ రోల్ చేస్తున్నారు. తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుందని సమాచారం. కాబట్టి డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కాకుండా.. మరో ప్రాజెక్ట్ విషయంలో నిర్మాతల భాగస్వామ్యం చూడాల్సి ఉంటుంది.

అయినా టీజర్ చూసి 'ఆది పురుష్' ఫలితాన్ని అంచనా వేయడం చాలా తొందర అవుతుంది. రిలీజ్ కు ఇంకా 100 రోజుల సమయం ఉంది కాబట్టి.. ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మేకర్స్ ఈ గ్యాప్ లో ఏవైనా మెరుగులు దిద్దే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం చేస్తారో.. సంక్రాంతికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో.. ఆ తర్వాత 'స్పిరిట్' పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.