Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : తిప్పరా మీసం

By:  Tupaki Desk   |   8 Nov 2019 9:37 AM GMT
మూవీ రివ్యూ  : తిప్పరా మీసం
X
‘తిప్పరా మీసం’ రివ్యూ
నటీనటులు: శ్రీవిష్ణు-నిక్కి తంబోలి-రోహిణి-బెనర్జీ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: సిధ్
నిర్మాత: రిజ్వాన్
రచన-దర్శకత్వం: కృష్ణ విజయ్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి.. వైవిధ్యమైన సినిమాలతో సాగిపోతున్న యువ కథానాయకుడు శ్రీవిష్ణు. చివరగా ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న అతను.. ఇప్పుడు ‘తిప్పరా మీసం’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రోమోల్లో భిన్నంగా కనిపించిన ‘తిప్పరా మీసం’ సినిమాగా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ: మణి (శ్రీ విష్ణు) చిన్నతనంలోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి దారి తప్పిన కుర్రాడు. తనను దారిలోకి తేవడం కోసం రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టించి తనకు దూరంగా ఉన్న తల్లి మీద ద్వేషం పెంచుకున్న మణి.. పూర్తిగా కుటుంబానికి దూరమై తన దారిన తాను బతుకుతుంటాడు. ఒక పబ్ లో డీజేగా పని చేస్తున్న మణి.. బెట్టింగులు చేయడం వల్ల అప్పుల్లో కూరుకుపోయి.. ఒక దశలో తల్లి మీదే కేసు వేసే పరిస్థితికి దిగజారుతాడు. మరి ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? మణి ఎప్పటికైనా మారాడా లేదా? అతను గర్వంతో మీసం తిప్పే సందర్భం జీవితంలో ఎప్పటికైనా వచ్చిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఈ రోజుల్లో హీరోను అతి మంచి వాడుగా చూపిస్తూ సందేశాలు ఇస్తే ఈ తరం ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు. హీరో రాముడు మంచి బాలుడిలా ఉంటే తట్టుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. అందుకే ఫిలిం మేకర్స్ నెగెటివ్ షేడ్స్ తో హీరో పాత్రల్ని తీర్చిదిద్ది యువ ప్రేక్షకులకు వల వేస్తున్నారు. ఆ మధ్య ‘అర్జున్ రెడ్డి’లో హీరోకు ఎన్ని అవలక్షణాలున్నాయో చూశాం. ఆ పాత్ర ఎంత బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో తెలిసిందే. ఈ మధ్య ‘ఇస్మార్ట్ శంకర్’లో పరమ బేవార్సుగా కనిపించిన హీరో ఎలా యువ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడో.. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో చూశాం. ఇప్పుడు ‘అసుర’ ఫేమ్ కృష్ణవిజయ్ సైతం తన హీరోను ఒక లోఫర్ లాగా చూపిస్తూ ‘తిప్పరా మీసం’ తీశాడు. ఐతే ‘ఇస్మార్ట్ శంకర్ట్’లో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో హీరో పాత్రలోకి అవలక్షణాల్ని జొప్పిస్తే.. వినోదమే లక్ష్యంగా ఆ పాత్ర సాగితే బాగానే ఉంటుంది. లేదా ‘అర్జున్ రెడ్డి’లో మాదిరి హీరో పాత్ర, దాని తాలూకు భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్టయినా ఓకే. కానీ ‘తిప్పరా మీసం’లో కథానాయకుడి పాత్ర ఈ రెండు కోవలకూ చెందదు. ఇందులో డ్రగ్స్ కు బానిసై దారి తప్పిన హీరో పాత్రతో ప్రేక్షకుడు ఏ దశలోనూ కనెక్టయ్యే అవకాశముండదు. ఇక ఆ పాత్ర నుంచి కనీస స్థాయిలోనూ వినోదం పండలేదు. మొత్తంగా అసలే ఉద్దేశంతో ఈ సినిమా తీశారో అర్థం కాని అయోమయంలోకి ప్రేక్షకులను నెడుతూ.. ఆద్యంతం సహనానికి పరీక్ష పెడుతుంది ‘తిప్పరా మీసం’.

తిప్పరా మీసం అనే టైటిల్ చూస్తే ఇదేదో మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తూ సాగే కమర్షియల్ సినిమానేమో అనిపిస్తుంది. కానీ ఇది ఎంతమాత్రం అలాంటి సినిమా కాదు. ‘అసుర’తో కొత్తదనం పంచిన కృష్ణవిజయ్ మరోసారి భిన్నమైన కథనే చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కథ ఏమాత్రం ప్రేక్షకులకు కనెక్టవుతుందని మాత్రం అతను ఆలోచించలేదు. ఇందులో హీరో చిన్నతనంలోనే డ్రగ్స్ కు బానిస అవుతాడు. చికిత్స తీసుకున్నాక మామూలు మనిషవుతాడు. డ్రగ్స్ మంచిది కాదని.. అవి తీసుకుంటే తాను మనిషిని కానని అతడికి అర్థమై వాటికి దూరంగా ఉంటాడు. ఆ విషయం తెలిసిన వాడు.. తనతో డ్రగ్స్ మాన్పించడం కోసం రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టిన తల్లిని మాత్రం అపార్థం చేసుకుంటాడు. ఆ కారణంతో ఇంటికి దూరమవుతాడు. ఆమెను డబ్బు కోసం వేధిస్తాడు. చివరికి తల్లి డబ్బు కోసం కోర్టుకు కూడా వెళ్తాడు. ఎంతమాత్రం అతడిలోో పశ్చాత్తాప భావం ఉండదు. అవలక్షణాలు నిండిన హీరో రౌడీల మీద, బయటి వాళ్ల మీద వీరత్వం చూపిస్తే ఓకే కానీ.. తల్లి మీద ఇలా కక్ష గట్టి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఏ ప్రేక్షకుడు మాత్రం హర్షిస్తాడు? రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలో హీరో సగం సమయం చెడ్డవాడిగా ఉండి.. ఆ తర్వాత పరివర్తన చెందినా ఓకే అనుకోవచ్చు. కానీ క్లైమాక్స్ ముందు వరకు హీరో ఇలాగే దారుణమైన ప్రవర్తనతో ప్రేక్షకులకే అతడి మీద అసహ్యం, జుగుప్స కలిగేలా చేస్తే ఇక సినిమాపై ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో చెప్పేదేముంది?

తల్లీ కొడుకుల బంధం .. సెంటిమెంటు అంటే మెజారిటీ ప్రేక్షకులకు కనెక్టయ్యే అంశాలే కానీ.. ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించని ట్రాక్ చాలా భారంగా సినిమా సాగేలా చేస్తుంది. ఇక డ్రగ్స్.. బెట్టింగులు.. పబ్బులు.. డీజేలు.. ఇల్లీగల్ గేమ్స్.. అంటూ సగటు ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ కాని అంశాల్ని డార్క్ స్టయిల్లో డీల్ చేయడంతో ‘తిప్పరా మీసం’ మన సినిమా కాదు అని మెజారిటీ ఆడియన్స్ ఫీలయ్యేలా చేశాడు కృష్ణ విజయ్. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ లోనూ పస లేకపోవడం.. ప్రథమార్ధమంతా హీరో పాత్ర ఎస్టాబ్లిష్మెంట్ కే పరిమితం కావడం.. కథనం మరీ నత్తనడకన సాగడంతో ప్రేక్షకులు విసుగెత్తిపోయే పరిస్థితి వస్తుంది. ద్వితీయార్ధ:లో మర్డర్ మిస్టరీ చుట్టూ నడిపిన ట్రాక్ కారణంగా సినిమా పూర్తిగా గాడి తప్పినట్లయింది. హీరో మారాక అతడికి తల్లికి మధ్య వచ్చే సన్నివేశాల వరకు హృద్యంగా అనిపిస్తాయి. మధ్యలో అక్కడక్కడా కొన్ని మెరుపు డైలాగ్స్.. ఒకట్రెండు సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. సాంకేతిక హంగులు బాగున్నాయి. అంతకుమించి ‘తిప్పరా మీసం’లో ప్రేక్షకులకు రుచించే అంశాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తదనం పేరుతో చేసిన ఒక వ్యర్థం ప్రయత్నంగా ఈ సినిమాను చెప్పొచ్చు.

నటీనటులు: శ్రీవిష్ణు మంచి పెర్ఫామర్ అని ఇప్పటికే రుజువైంది. ఈ సినిమాతో అతను నటుడిగా మరోసారి తనదైన ముద్ర వేశాడు. అతడి లుక్ బాగుంది. పాత్ర ఎలా ఉన్నప్పటికీ.. శ్రీవిష్ణు తన నటనతో దానికి బలం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్ తాలూకు సంఘర్షణను అతను బాగానే చూపించాడు. హీరోయిన్ నిక్కి తంబోలి గురించి చెప్పడానికేమీ లేదు. ఆమె అంత అందంగానూ లేదు. నటనలోనూ ఏ ప్రత్యేకతా లేదు. హీరో పక్కన ఆమె సూట్ కాలేదు కూడా. రోహిణి తన అనుభవాన్నంతా చూపిస్తూ తల్లి పాత్రలో జీవించేసింది. కొన్ని సన్నివేశాల్లో రోహిణి నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ ఆమే అనడంలో సందేహం లేదు. బెనర్జీ కూడా బాగా చేశాడు.

సాంకేతిక వర్గం: సురేష్ బొబ్బిలి పాటలు అంతగా గుర్తుండవు. సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం కూడా లేవు. ఐతే అతడి నేపథ్య సంగీతం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. మన తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా వినిపించే సౌండ్స్ చాలా వరకు ఇందులో లేవు. కాకపోతే కొన్నిచోట్ల సన్నివేశాల ఉద్దేశానికి భిన్నంగా నేపథ్య సంగీతం సాగడం ఆశ్చర్యపరుస్తుంది. సిధ్ ఛాయాగ్రహణం కూడా భిన్నమైన అనుభూతిని పంచుతుంది. కాన్సెప్ట్ కు తగ్గట్లుగా భిన్నమైన కలర్ థీమ్స్ తో సినిమా సాగుతుంది. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు కృష్ణవిజయ్ కొత్తగా ఏదో చేద్దామని ప్రయత్నించాడు కానీ.. ఈ క్రమంలో ప్రేక్షకులకు ఈ కథ, హీరో పాత్ర ఎంతమాత్రం కనెక్ట్ అవుతుందని ఆలోచించలేదనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా ద్వారా అతను ఏం చెప్పదలుచుకున్నాడన్నదే అర్థం కాదు. కథే కనెక్ట్ కాదంటే.. నీరసమైన కథనం చాలా త్వరగా ప్రేక్షకుల ఆసక్తి నీరుగారిపోయేలా చేసింది. అక్కడక్కడా కొన్ని మంచి డైలాగులు రాయడం మినహాయిస్తే రచయితగా.. దర్శకుడిగా కృష్ణ విజయ్ విఫలమయ్యాడు.

చివరగా: తిప్పరా మీసం.. తెప్పిస్తుంది నీరసం

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre