ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన 'తిమ్మరుసు' ట్రైలర్..!

Mon Jul 26 2021 18:24:57 GMT+0530 (IST)

Thimmarusu Trailer Talk An Engrossing Action Drama

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ - ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''తిమ్మరుసు''. 'అసైన్‌మెంట్ వాలి' అనేది దీనికి ఉపశీర్షిక. 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం అయింది. జూలై 30న థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'తిమ్మరుసు' ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.ఇందులో రామచంద్ర అనే నిజాయితీపరుడైన లాయర్ పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నారు. అతను చాలా తెలివైన వాడని.. కాకపోతే ప్రాక్టికల్ కాదని.. ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుంచి కారుకు వస్తారు.. కానీ రామచంద్ర మాత్రం కారు నుండి బైక్ కి వచ్చాడు అని అతని క్యారక్టర్ ని పరిచయం చేసారు. ఎనిమిదేళ్ల క్రితం మర్డర్ కేసుని రీ ఓపెన్ చేయించి.. న్యాయం కోసం పోరాడే క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది 'తిమ్మరుసు' ట్రైలర్ లో చూపించారు.

హీరోని అడ్డుకునే అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ గా అజయ్ నటించగా.. సత్యదేవ్ వెంట నడిచే లాయర్ గా బ్రహ్మజీ కనిపిస్తున్నారు. హీరో లాయర్ అయినప్పటికీ యాక్షన్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ఈ కేసుని లాయర్ రామ్ ఎలా డీల్ చేసాడు? హంతుకుడికి శిక్ష వేయించారా లేదా? అసైన్‌మెంట్ వాలి ఏంటి? అనేది తెలియాలంటే 'తిమ్మరుసు' సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉండటంతో పాటుగా సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. దీనికి శ్రీ చరణ్ పాకల బ్యాగ్రౌండ్ స్కోర్ - అప్పు ప్రభాకర్ విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.

'తిమ్మరుసు' చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్ ఎరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రవీణ్ - ఆదర్శ్ బాలకృష్ణ - ఝాన్సీ - వైవా హర్ష - సంధ్యా - జనక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత థియేటర్లలోకి వస్తున్న ఫస్ట్ సినిమా అయిన ''తిమ్మరుసు'' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.