Begin typing your search above and press return to search.

మీడియా వేధింపులకు గురి చేస్తోంది అంటూ పోలీసులకు దిశా సలియాన్ తండ్రి లేఖ...!

By:  Tupaki Desk   |   6 Aug 2020 4:45 AM GMT
మీడియా వేధింపులకు గురి చేస్తోంది అంటూ పోలీసులకు దిశా సలియాన్ తండ్రి లేఖ...!
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ సూసైడ్ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 8న సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియాన్ సూసైడ్ చేసుకున్న తర్వాత జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అనేక అనుమానాలు కలిగించింది. ముంబైలోని మలద్‌ ప్రాంతంలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు దిశా. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మృతికి దిశా సలియన్‌ సూసైడ్ కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అనేక అనుమానాలు రేకెత్తాయి. ఈ క్రమంలో దిశ మరణంపై సోషల్‌ మీడియాలో వార్తాపత్రికలు టీవీ ఛానళ్లలో వరుస కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిశ తండ్రి సతీష్ సలియాన్ తన ఫ్యామిలీని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహారాష్ట్రలోని మాల్వాని అదనపు పోలీసు కమిషనర్ దిలీప్ యాదవ్‌ కు లేఖ రాశారు.

కాగా సతీష్ సలియాన్ తన లేఖలో తమ కుటుంబంపై జరుగుతున్న మానసిక వేధింపుల గురించి.. మరణించిన తన కుమార్తెకు సంబంధించి మీడియా మరియు జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరు గురించి తెలిపారు. ఈ వ్యక్తులు తమకు ముంబై పోలీసుల పట్ల గల నమ్మకాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ కుమార్తె మరణానికి సంబంధించి అన్యాయంగా ఎవరిని బాధ్యులను చేయవద్దని గతంలోనే పోలీసులను కోరామని చెప్పుకొచ్చాడు. నా కుమార్తె మరణానికి సంబంధించి ఇంటర్వ్యూల పేరిట మీడియా వారు తప్పుదోవ పట్టించే వార్తలను అందిస్తున్నారు. ఇది వాస్తవ విచారణకు అడ్డంకిని సృష్టించడమే కాకుండా ఇది నా కుటుంబాన్ని కూడా దెబ్బతీస్తోంది అని పేర్కొన్నాడు.

ముంబై పోలీసులపై విశ్వాసాన్ని పదేపదే ప్రశ్నిస్తూ మీడియా వారు ఎంక్వైరీ చేయడం ద్వారా మేము వేధింపులకు గురవుతున్నాము. ఇప్పటికే మాకు ఈ కేసులో ఎవరిపైనా అనుమానం లేదని పోలీసులకు మా స్టేట్మెంట్ ఇచ్చాము. ఈ లేఖ ద్వారా మాపై అనాలోచిత చర్యకు పాల్పడిన సంబంధిత జర్నలిస్టులు రాజకీయ నాయకులు మరియు మీడియా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని దిశా తండ్రి సతీష్ సలియాన్ తన లేఖలో పేర్కొన్నారు. దిశ సలియాన్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే సంచలన ఆరోపణలు చేసిన మరునాడు దిశా తండ్రి ఈ లేఖ రాసారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ఆధారాలు దొరికినా ఆ వివరాలు తమకు అందచేయాలని ముంబై పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.