Begin typing your search above and press return to search.

నటి జయంతి గురించి చాలాతక్కువ మందికి తెలిసిన నిజాలు

By:  Tupaki Desk   |   26 July 2021 11:51 AM GMT
నటి జయంతి గురించి చాలాతక్కువ మందికి తెలిసిన నిజాలు
X
సీనియర్ నటి జయంతి ఇక లేరన్న సంగతి తెలిసిందే. దక్షిణాది భాషలతోపాటు మరాఠీలో కూడా సినిమాలు చేసిన జయంతి అగ్రహీరోలు అందరితో నటించారు. స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆమె బేస్ వాయిస్.. మరే నటిలోనూ కనిపించదని చెప్పక తప్పదు. జయంతి ఇక లేరన్న ఊహ.. ఇప్పటి తరానికి పెద్దగా పెయిన్ అనిపించకున్నా.. 80లలో పుట్టిన వారి వరకూ.. ఆమెను మిస్ అవుతున్నామన్న భావనకు గురి కావటం ఖాయం. తిరిగి రాని లోకాలకు ఆమె వెళ్లిపోయిన వేళ.. జయంతి యాదిలో ఆమెకు సంబంధించిన ఐదు ఆసక్తికర అంశాలు. ఇక్కడ ప్రస్తావించే ఈ అంశాలు మరే ఇతర నటీమణులకు సాధ్యం కాదని చెప్పాలి.

1. ఆయనతో మాత్రం చెల్లిగానే..

సీనియర్ నటిగా సుపరిచితురాలైన జయంతికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అక్కినేని నాగేశ్వరరావుతో చాలానే సినిమాలు చేశారు. అన్ని సినిమాల్లో ఆయన సోదరిలానే చేశారే తప్పించి హీరోయిన్ గా చేయలేదు. అంతేకాదు.. అక్కినేని అంటే ఆమె కుటుంబంలోని వారికి చాలా ఇష్టం. ఆమె తన తమ్ముడికి నాగేశ్వరరావు పేరుపెట్టటం చూస్తే...ఆ అనుబంధం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

2. ఆయన ఒక్కడితోనే 40 సినిమాలు

ఒక హీరోయిన్.. గరిష్ఠంగా ఒక హీరోతో ఎన్ని సినిమాలు చేయగలరు? ఐదా? పదా? అన్న దగ్గరే మన ఆలోచనలు ఆగిపోతాయి. కానీ.. జయంతి రికార్డును ఇప్పట్లో అయితే ఎవరూ బ్రేక్ చేయలేరు. హీరోయిన్ గా ఆమె ఎంతోమంది అగ్ర నటులుతో నటించారు. అయితే.. కన్నడ రాజ్ కుమార్ తో మాత్రం ఏకంగా 40 సినిమాలు నటించిన రికార్డును ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేరేమో.

3. పక్కపక్కనే ఇల్లు.. ఒళ్లో ఆడుకున్న చిన్నారే ఆయనకు హీరోయిన్

సినిమాలకు మించిన విచిత్రమైన లోకం మరేదీ ఉండదు. రీల్ కు రియల్ కు ఏ మాత్రం సంబంధం లేని అంశాలెన్నో ఇక్కడ జరుగుతుంటాయి. నటి జయంతి విషయానికి వస్తే.. ఆమె కుటుంబం బళ్లారి నుంచి చెన్నై రావటం.. వారి ఇంటి పక్కనే ఎన్టీఆర్ ఇల్లు ఉండేది. అప్పట్లో జయంతి చాలా చిన్న పిల్ల. ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆడుకునేది. ఆయన ఒడిలో కూర్చో పెట్టుకొని కబుర్లు చెప్పేవారు. ఈ చనువుతో తమ అమ్మాయికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని జయంతి తల్లి ఎన్టీఆర్ ను కోరినప్పుడు ఆయనిచ్చిన సలహా ఏమిటో తెలుసా?

ముందు మీ అమ్మాయిని బాగా చదివించండి. సినిమాలు.. డ్యాన్సులంటూ పక్కదారి పట్టించకండి. పెద్దమ్మాయి అయ్యాక చూద్దామన్నారట. ఆ తర్వాత కన్నడ సినిమాతో తెరంగ్రేటం చేసినా.. ఆమె తెలుగులో చేసిన మొదటి చిత్రం ఎన్టీఆర్ నటించిన 'జగదేక వీరుని కథ'. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. కొండవీటి సింహం.. జస్టిస్ చౌదరి సినిమాల్లో ఎన్టీఆర్ కు జంటగా నటించారు. ఆ సినిమాలు ఎంతలా విజయవంతం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

4. జయంతి కాదు ఒరిజినల్ నేమ్ కమలా కుమారి

జయంతిగా తెలుగుప్రజలతో పాటు దక్షిణాది వారికి సుపరిచితురాలైన ఆమె అసలు పేరేమిటో తెలుసా? కమలాకుమారి. సినిమాల్లోకి వచ్చే ముందు.. ఆమె పేరు అంతగా బాగోలేదని జయంతిగా మార్చేశారు కన్నడ దర్శకుడు వైఆర్ పుట్టుస్వామి. మొదట్లో జయంతి బొద్దుగా ఉండేది. దీంతో.. సినిమాల్లో అవకాశం రాదన్న ఉద్దేశంతో పట్టుబట్టి మరీ సన్నగా అయ్యారు. గ్రూపు డ్యాన్సులో అవకాశం వస్తేచాలనుకున్న ఆమెకు.. ఆమె డ్యాన్స్ చేసే తీరుతో ఏకంగా లీడ్ రోల్ దక్కింది. అలా మొదటి సినిమాకు ఎంపికయ్యారు జయంతి.

5. తొలి స్విమ్ సూట్ క్రెడిట్ ఆమెదే

గ్లామర్ ఒలకబోయటం పెద్ద విషయం కాదు. కానీ.. అరవైల్లో ఇప్పటి పరిస్థితులు ఉండేవి కావు. అప్పట్లో నటీమణులకు ఉండే పరిమితులు అన్ని ఇన్ని కావు. వారికి ఎదురయ్యే ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండేవి. అలాంటి సమయంలో ఒక క్యారెక్టర్ కోసం ఏకంగా స్విమ్ సూట్ వేసుకున్న మొదటి నటిగా జయంతి నిలిచిపోతారు. మిస్ లీలావతి అనే కన్నడ సినిమా కోసం ఆమె.. కంప్లీట్ వెస్ట్రన్ వేర్ ధరించటమే కాదు.. అప్పట్లోనే టీ షర్టులు.. నైటీలు.. స్విమ్ సూట్ కూడా ఈ సినిమాలో ధరించారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి కలల రారాణిగా నిలిచారు. తన అందంతో శాండల్ వుడ్ కు గ్లామర్ తణుకులు అద్దిన తొలి హీరోయిన్ ఆమే.

ఆమె నటించిన మిస్ లీలావతి సినిమాకు ప్రెసిడెంట్ మెడల్ దక్కింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ మెడల్ అందిస్తూ.. జయంతిని అప్యాయంగా ముద్దాడి.. గుడ్ లక్ చెప్పిన వైనం అప్పట్లో సంచలనం. ఇదే విషయాన్ని జయంతి పలుమార్లు గుర్తు చేసుకుంటూ.. తన జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా ఆమె చెబుతుండేవారు.