'ఫ్యామిలీ మ్యాన్' ఫ్యామిలీ పారితోషికాలు ఇవే

Thu Jun 10 2021 10:16:46 GMT+0530 (IST)

These are the 'Family Man' family rewards

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 గురించిన చర్చ జరుగుతోంది. ఉత్తరాదిన హిందీలో చూసిన ప్రేక్షకులు వెబ్ సిరీస్ గురించి చర్చించుకుంటూ ఉంటే సౌత్ ఆడియన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు తెలుగు.. తమిళం.. ఇతర సౌత్ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంటుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సౌత్ ఆడియన్స్ కొందరు హిందీ వర్షన్ నే చూసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించిన నటీ నటుల పారితోషికం విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంత పెద్ద సక్సెస్ అయిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన మనోజ్ బాజ్ పాయ్.. ప్రియమణి.. సమంత ఇంకా ఇతర నటీ నటులు పారితోషికం గురించి చర్చ జరుగుతోంది.వెబ్ సిరీస్ లో కీలక పాత్ర అయిన శ్రీకాంత్ తివారి గా నటించిన మనోజ్ బాజ్ పాయ్ రెండు సీజన్ లకు కలిపి 10 కోట్ల పారితోషికం అందుకున్నాడట. అంటే సీజన్ 2 కు ఆయన అయిదు కోట్ల పారితోషికం అందుకున్నట్లు. ఇక సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రాజీ పాత్రకు గాను ఏకంగా మూడున్నర నుండి నాలుగు కోట్ల పారితోషికంను అందుకుందట. సమంత నటించిన మొదటి వెబ్ సిరీస్ అయినా కూడా ఆమెకు ఇది మంచి విజయాన్ని తెచ్చి పెట్టడంతో పాటు పారితోషికం విషయంలో కూడా చాలా సంతృప్తికరంగా నిలిచినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఇక శ్రీకాంత్ తివారి భార్య సుచితగా నటించిన ప్రియమణికి గత సీజన్ కు 80 లక్షలు ఇవ్వగా రెండవ సీజన్ కు గాను దాదాపుగా రూ.90 లక్షలు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఇక మొదటి సీజన్ లో పెద్దగా ప్రాముఖ్యత లేని శ్రీకాంత్ తివారి కూతురుకు రెండవ పార్ట్ లో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కనుక ఆ పాత్రను చేసినందుకు గాను ఆశ్లేషా ఠాకూర్ కు రూ.50 లక్షల పారితోషికం ఇచ్చారట. ఇక దర్శన్ కుమార్ కు కోటి రూపాయలు శరత్ ఖేల్కర్ కు 1.6 కోట్లు.. సన్నీ హిందూజాకు రూ.60 లక్షలు మరియు షరీఫ్ హష్మీకి రూ.65 లక్షల పారితోషికంను మేకర్స్ ముట్టజెప్పినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సీజన్ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీజన్ 3 ఉంటుందనే నమ్మకంను బాలీవుడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.