Begin typing your search above and press return to search.

అప్పుడు బాడీషేమింగ్ చేసినోళ్లకు తాజా ఫోటోతో షాకిచ్చింది

By:  Tupaki Desk   |   19 July 2021 3:49 AM GMT
అప్పుడు బాడీషేమింగ్ చేసినోళ్లకు తాజా ఫోటోతో షాకిచ్చింది
X
మగాడికి లేని ఇబ్బందులన్ని మహిళలకే అన్న నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. సృష్టి ధర్మాన్ని కొనసాగించే మహిళలు.. వారి జీవితంలో ఎదుర్కొనే అత్యంత క్లిష్టసమయం వారు గర్భం దాల్చే వేళలోనే. కడుపులో మరో పసి ప్రాణాన్ని మోస్తున్న వేళ.. శరీరంలో చోటు చేసుకునే మార్పులు అన్ని ఇన్ని కావు. ఇలాంటివేళలో శరీరం బలహీనంగా మారటమే కాదు.. పలు మార్పులు చోటు చేసుకుంటాయి. స్లిమ్ గా ఉండే వారు సైతం భారీగా బరువు పెరుగుతారు. మరొకరికి ప్రాణం పోయటం అంత తేలికైన విషయం కాదు కదా?

ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే వారికి అండగా ఉండాల్సింది పోయి.. మీ స్లిమ్ నెస్ ఏమైంది? మరీ ఇంత లావుగానా? అంటూ బాడీ షేమింగ్ చేసే వారిని ఏమనాలి? సామాన్యులకు ఇలాంటి సమస్యలు ఉండవేమో కానీ.. సినీ సెలబ్రిటీలకు మాత్రం ఇలాంటి వేళలో ఎదురయ్యే సమస్యలు అన్ని ఇన్ని కావు. ఎంత తారలు అయినప్పటికీ.. వారు మనుషులే కదా? వారికి మామూలు మహిళ మాదిరే గర్భం దాల్చిన సమయంలో సమస్యలు వచ్చే సమస్యలు.. ఇబ్బందులు తప్పవు. అలాంటప్పుడు వారికి అండగా నిలవాల్సింది పోయి.. దారుణ వ్యాఖ్యలతో విరుచుకుపడటం ఏ మాత్రం సంస్కారం కాదన్న సంగతి మర్చిపోకూడదు.

సినీ నటి సమీరారెడ్డి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. మొదటిసారి గర్భం దాల్చిన వేళలో.. ఆమె ఏకంగా 105 కేజీల బరువుకు పెరిగారు. ఆమె ఫోటో షూట్ పై దారుణ వ్యాఖ్యలు చేశారు. ఇంత లావుగా అయ్యాక గర్భంతో ఫోటోలు దిగాలా? అని చెత్త ప్రశ్నలు వేసినోళ్లు ఉన్నారు. అలాంటి కామెంట్లకు తీవ్రమైన మనో వ్యధకు గురైనప్పటికీ.. రెండోసారి గర్భం దాల్చే సమయానికి ఆమె రాటుదేలారు. ఎవరేం అనుకుంటారన్న విషయాన్ని పక్కన పెట్టి.. నిర్బయంగా డెలివరీకి ఒక రోజు ముందు కూడా ఫోటో షూట్ చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. ఎంతో మంది మహిళలకు కొత్త స్ఫూర్తిని రగిలించారు.

కడుపుతో ఉన్న వేళలో సమీరాను బాడీ షేమింగ్ చేసినోళ్లు.. తాజాగా ఆమెను చూస్తే.. సిగ్గు పడాల్సిందే. ఎందుకంటే.. ప్రకృతి ధర్మాన్ని పాటించే వేళలో శరీరంలో వచ్చే మార్పులకు సానుకూలంగా స్పందించాలే తప్పించి మనస్తాపాన్ని కలిగించేలా వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరికాదు. తాజాగా సమీరాను చూస్తే.. వెనుకటి రూపాన్ని ఆమె తెచ్చేసుకున్నారు. బాడీ షేమింగ్ చేసినోళ్లకు తన తాజా ఫోటోతో సిగ్గుపడేలా చేశారని చెప్పాలి. ఏమైనా.. సమీరాను అభిమానించే వారికి మాత్రం ఆమె గోవాలో దిగిన తాజా ఫోటోలు అలరించటమే కాదు.. శభాష్ సమీరా.. ఫోటోతో భలేగా సమాధానం చెప్పావుగా అనిపించక మానదు.