థియేట్రికల్ హక్కులు భారీ ధర పలికిన బాలయ్య మూవీ..!

Mon Feb 22 2021 21:00:01 GMT+0530 (IST)

Theatrical rights for a Balayya movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింహా లెజెండ్ లాంటి భారీ విజయాల తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శీను నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో మూడో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాలయ్య ఫస్ట్ లుక్ టీజర్ నుండి ఆకట్టుకుంటూనే ఉంది. టీజర్ తోనే బాలయ్య ఫ్యాన్స్ లో ఈ సినిమా పై అంచనాలు ఓ స్థాయిలో నెలకొన్నాయి. బిబి3 ప్రచారం అవుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. తమన్ రెండోసారి బాలయ్య మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ప్రతిసారి లాగే బోయపాటి కకాంబోలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. బాలయ్య 106వ సినిమాగా ఇది రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ ముందే ప్రీరిలీజ్ బిజినెస్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్ర హక్కులు 35కోట్ల వరకు అమ్ముడవగా.. నైజాం ఉత్తరాంద్ర హక్కులను 16కోట్లకు దిల్ రాజు దక్కించుకున్నాడని టాక్. వేసవి కానుకగా మే 28న బిబి3 విడుదల కాబోతుంది. ఈ సినిమాతో బోయపాటి - బాలయ్య హ్యాట్రిక్ పక్కా అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు మొన్నటి వరకు మోనార్క్ అనే పేరు పెట్టనున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. అధికారిక ప్రకటన బయటికి రానప్పటికి గాడ్ ఫాదర్ అనేది ఫైనల్ అయినట్లు సన్నిహిత వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హీరోయిన్ పూర్ణ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.