'ది జంగిల్ బుక్' చైనా రికార్డులు బ్రేక్!

Wed Jul 17 2019 19:59:23 GMT+0530 (IST)

The lion King Creates Records In China

2016లో రిలీజైన `ది జంగిల్ బుక్` సంచలనాల గురించి ఇప్పటికీ ట్రేడ్ లో చర్చ సాగుతూనే ఉంది. 2గం.ల నిడివితో తెరకెక్కిన ఈ యానిమేషన్ 3డి (2డి) సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించడమే గాక ఇండియా నుంచి ఏకంగా 300కోట్లు కొల్లగొట్టింది. అందుకే ఇప్పుడు అదే తరహా కంటెంట్ తో వస్తున్న `ది లయన్ కింగ్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో అంటూ ట్రేడ్ లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ది జంగిల్ బుక్ రికార్డుల్ని దృష్టిలో పెట్టుకుని డిస్నీ సంస్థ `ది లయన్ కింగ్` కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల్ని తీసుకుంది. ముఖ్యంగా ఇండియా మార్కెట్ నుంచి 500 కోట్ల మేర కరెన్సీని తోడేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టే కనిపిస్తోంది.అందుకు తగ్గట్టే ఇక్కడ ప్రచారం ఓ రేంజులో ఉంది. భారతదేశంలో తెలుగు-తమిళం-హిందీ- ఇంగ్లీష్ వెర్షన్లలో రిలీజ్ చేయడమే గాక ఆయా భాషల్లో ప్రముఖ స్టార్లను ఎంపిక చేసుకుని ఇందులో పాత్రలకు డబ్బింగులు చెప్పించారు. ఇది ప్రచారానికి బాగా కలిసొచ్చి ఇప్పుడు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగులకు సాయం అవుతోంది. ఇప్పటికే ఇండియాలో మల్టీప్లెక్స్ టిక్కెట్ విండోస్ జామ్ అవుతున్నాయన్న సమాచారం ఉంది. ఆన్ లైన్ టికెటింగ్ స్పీడందుకుంది.

ఇండియా రికార్డుల గురించి ఎల్లుండి నుంచి ముచ్చట మొదలవుతుంది. అయితే మనకంటే ముందే `ది లయన్ కింగ్` చైనాలో రిలీజైపోయింది. అక్కడ తొలి వీకెండ్ దుమ్ము దులిపేసింది. `ది జంగిల్ బుక్` చైనా రికార్డుల్ని ఈ సినిమా తిరగరాస్తోంది. రోజుకు 13 మిలియన్ డాలర్లు చొప్పున మూడు రోజుల్లో 54 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ఈ మొత్తం 372 కోట్లు. కేవలం మూడు రోజుల్లో ఇంత వసూలు చేసిందంటే తొలి వారం.. మలివారం.. ఫుల్ రన్ లో ఈ సినిమా ఇంకెంత వసూలు చేయనుందో అంచనా వేయొచ్చు. ఇప్పటికే `ది జంగిల్ బుక్` తొలి వీకెండ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఇక ఉత్తర అమెరికాలోనూ ఇండియాతో పాటుగా ఈ నెల 19న రిలీజవుతోంది. అక్కడా ఇప్పటికే రిలీజైన పలు హాలీవుడ్ సినిమాల రికార్డుల్ని `ది లయన్ కింగ్` బ్రేక్ చేయనుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. కేవలం అమెరికా నుంచి తొలి వీకెండ్ 175-200 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.