గుడ్ న్యూస్: రెండురోజుల్లో తెలంగాణలో తెరుచుకునే సినిమాహాళ్లు ఎన్నంటే?

Wed Jul 21 2021 08:51:33 GMT+0530 (IST)

The good news: How many cinema halls will open in Telangana in two days?

పాడు కరోనా.. మాయదారి మహమ్మారి ఎన్ని ఇబ్బందుల్ని పెట్టిందో.. మరెన్ని వసతుల్ని మిస్ చేసిందోనని ప్రతిఒక్కరూ తిట్టుకునే పరిస్థితి. మనిషి జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేసిన కరోనా దెబ్బకు.. అంతకు ముందు ఇల్లు కేవలం నిద్రకు మాత్రమే గుర్తుకు వస్తే.. కరోనా దెబ్బకు ఎంతో అవసరమైతే తప్పించి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితిని కల్పించింది. మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ లో సినిమా థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు మూసేయటం తెలిసిందే. లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసి.. థియేటర్లు కూడా తెరుచుకోవచ్చని చెప్పినప్పటికీ.. సినిమాహాళ్లు ఓపెన్ కాని పరిస్థితి. ఇలాంటివేళ.. తాజాగా గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.ఈ నెల 23న అంటే మరో రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా సినిమా థియేటర్లు ఓపెన్ కావటానికి సిద్ధమవుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్ల తలుపులు తెరుచుకోనున్నాయి. వెండితెర వెలగనుంది. ఇంట్లో ఉండే పెట్టెల్లాంటి టీవీల్లో సినిమాలతో పాటు.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద ఎంటర్ టైన్మెంట్ ను చూసి చూసి.. విసిగిపోయిన ప్రాణాలకు బారెడు స్క్రీన్ రారమ్మని పిలిచే రోజు దగ్గరకు వచ్చేసింది. అయితే.. రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తెరుచుకునే సింగిల్ థియేటర్లు చాలా చాలా తక్కువగా చెబుతున్నారు.

దీనికి కారణం కొత్త సినిమాలేవీ విడుదలకు ముందుకు రాకపోవటమే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రీఓపెన్ అవుతున్న థియేటర్లలో వేసేందుకు కొత్త సినిమాలు ఏమీ సిద్ధంగా లేవు. 23న ‘నేరగాడు’ అనే లో బడ్జెట్ మూవీ విడుదల కానుంది. దీంతో.. ఆ సినిమాను ప్రదర్శించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కేవలం పదిహేను సింగిల్ థియేటర్ల వారు మాత్రమే ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 30న మాత్రం తెలంగాణ వ్యాప్తంగా అన్ని సింగిల్ థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు ఓపెన్ కానున్నాయి.

దీనికి మరో ప్రధాన కారణం కూడా చెబుతున్నారు. నెల చివర కావటం.. అప్పటికే థియేటర్లు ఓపెన్ అయి వారం కావటం.. పెద్ద చిత్రాలు ఆ రోజు విడుదలకు ఆసక్తి చూపించటం.. కొత్త నెల ప్రారంభం కావటంతో సిబ్బంది విషయంలోనూ కొన్ని అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది.అందుకే.. జులై 30న మాత్రం తెలంగాణ వ్యాప్తంగా అన్ని సింగిల్ థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు రీఓపెన్ కానున్నాయని చెబుతున్నారు. మరీసారి.. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందన్నది ఉత్కంటగా మారింది. ఎందుకంటే.. మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తలు జోరుగా వస్తున్న వేళ.. థియేటర్లకు జనాలు ఎంతమేర వస్తారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.