Begin typing your search above and press return to search.

థియేట‌ర్లు తెరిచేందుకు కేంద్రం అనుమ‌తించ‌లేదు!

By:  Tupaki Desk   |   17 Sep 2020 7:10 AM GMT
థియేట‌ర్లు తెరిచేందుకు కేంద్రం అనుమ‌తించ‌లేదు!
X
థియేట‌ర్లు తెర‌వాలా వ‌ద్దా? ప‌్ర‌స్తుతం స‌ర్వ‌త్రా అంద‌రిలో డౌట్ ఇది. ముఖ్యంగా ఐదారు నెల‌లుగా ఈ రంగంలోని వేలాది కార్మికులు బ‌తుకుతెరువు లేక‌ రోడ్డున ప‌డ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే థియేట‌ర్లు తెరిచేందుకు అనుమ‌తిస్తే వైర‌స్ మ‌మ‌హ్మారీ తీవ్ర‌త మ‌రింత వేగంగా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే థియేట‌ర్ల వ‌ర‌కూ అనుమ‌తులు ఇవ్వాలంటే ఆచితూచి అడుగులేయాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అయితే ఇప్ప‌టికే కేంద్రం నుంచి అనుమ‌తులు వ‌చ్చేశాయ‌ని ఇక అక్టోబ‌ర్ 1 నుంచి థియేట‌ర్ల‌ను తెరిచేందుకు నియ‌మ‌నిబంధ‌న‌ల్ని ప్ర‌క‌టించేస్తార‌ని ప్ర‌చారం సాగిపోతోంది. దీంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగ్జిబిట‌ర్ల‌లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా మ‌ల్టీప్లెక్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా వాళ్లు కేంద్రాన్ని థియేట‌ర్ల బంద్ ఎత్తేయాల్సిందిగా డిమాండ్ చేయ‌డంతో ఇక కేంద్రం దిగొచ్చిన‌ట్టేన‌న్న చ‌ర్చా వేడెక్కిపోతోంది.

కానీ వాస్త‌వం మాత్రం వేరొక‌లా ఉంద‌నేది తాజాగా పీఐబీ ప్ర‌క‌ట‌న నిర్ధారిస్తోంది. ``ఇంత‌వ‌ర‌కూ కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు! అక్టోబ‌ర్ 1న థియేట‌ర్లు తెరుచుకోవు`` అని పీఐబీ ధృవీక‌రించింది. దీంతో ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెరిచే వీల్లేద‌ని ఖాయ‌మైపోయిన‌ట్టే. వినాయ‌క చ‌వితి వెళ్లింది. అక్టోబ‌ర్ లో అయినా థియేట‌ర్లు తెరిస్తే ద‌సరా పండ‌క్కి సినిమాల రిలీజ్ ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. అదీ కుద‌ర‌క‌పోతే ఇక క్రిస్మ‌స్ సెల‌వులేన‌ని అనుకుంటున్నారు. కానీ ఎప్ప‌టికి థియేట‌ర్లు తెరిచేందుకు అనుమ‌తులు ల‌భిస్తాయి? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మ‌హ‌మ్మారీ ఉధృతిలో థియేట‌ర్లు తెరిస్తే న‌ష్ట‌మేన‌నేది తెలుగు ఎగ్జిబిట‌ర్లు కం నిర్మాత‌లు బ‌లంగా చెబుతున్న మాట‌. ఇలాంట‌ప్పుడు కేంద్రం ఓకే చెప్పినా థియేట‌ర్లు తీస్తారా? అన్న‌ది కూడా సందిగ్ధ‌మే. ఇక‌పోతే టీవీ మీడియాల్లో థియేట‌ర్లు తెరిచేస్తున్నారు అంటూ సాగుతున్న ప్ర‌చారానికి పీఐబీ అనూహ్యంగా చెక్ పెట్టేసింది తాజా ప్ర‌క‌ట‌న‌తో.