5 నిమిషాలు చూస్తానని చెప్పిన ఉప రాష్ట్రపతి సినిమా మొత్తం చూశారట

Thu Oct 21 2021 10:19:53 GMT+0530 (IST)

The Vice President said that he will watch the whole movie

ఈ వారం విడుదలయ్యే మూవీ ‘‘నాట్యం’’. రోటీన్ కు భిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీ మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేకున్నా.. ఆ మధ్యన విడుదల చేసిన టీజర్.. తర్వాత విడుదలైన పాటలు.. ఈ చిత్రానికి అనుసరిస్తున్న ప్రచార పంథా సినిమా మీద ఆసక్తి వ్యక్తమయ్యేలా చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ సినిమాలో హీరోయిన్ సంధ్యా రాజు మూవీ నిర్మాత కూడా కావటం. పెళ్లైన ఆమె.. పారిశ్రామికవేత్తగా సుపరిచితురాలు.కానీ.. నాట్యం మీద తనకున్న మక్కువతో పాటు.. విభిన్న కథాంశంతో మూవీని చేయాలన్న ఉద్దేశంతో ఆమె నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు ఆసక్తికరంగామారింది. మరో రోజులో విడుదలయ్యే ఈ మూవీకి సంబంధించి ఆమె వెల్లడించిన విషయం ఇప్పుడు అందరిని ఆకర్షించేలా ఉంది. తన సినిమాను చూడాలని ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని కోరారు. ఆయనకున్న ఆరోగ్య సమస్య కారణంగా ఐదు నిమిషాల పాటు సినిమా చూస్తానని చెప్పారట. కానీ.. సినిమా మొదలైన తర్వాత మాత్రం అలానే చూస్తుండిపోయారని.. సినిమా మొత్తం చూసి తనను సత్కరించినట్లు ఆమె చెబుతున్నారు.

అంతేకాదు..తమ సినిమా టీజర్ ను చూసిన మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసించినట్లుచెప్పారు. తాను సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా వ్యాపార రంగం నుంచి వచ్చి.. సినిమా తీసినా తనను ప్రోత్సహించటాన్ని ఆమె ప్రత్యేకంగా చెబుతన్నారు. నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయని.. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తామని.. క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దుల్ని చూపిస్తామన్నారు. కమర్షియల్ మూవీలానే తమ నాట్యం ఉంటుందని. నాట్యం అనేది ఊరి పేరుగా ఆమె చెప్పారు.