లవర్ ను మధ్యలో వదిలేసిన రౌడీ హీరో!

Mon Feb 17 2020 11:30:01 GMT+0530 (IST)

The Rowdy Hero who Left The Lover In The Middle

యువహీరో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ అయింది. సినిమా విడుదలకు ముందు పెద్దగా బజ్ లేదు. రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన దక్కడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు. తొలిరోజు వసూళ్లు 'డియర్ కామ్రేడ్' ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే తక్కువగా నమోదు కావడం అందరినీ షాక్ కు గురిచేసింది.అదేంటో కానీ విజయ్ దేవరకొండ తన గత చిత్రాలకు ప్రచారం చేసిన స్థాయిలో ఈ సినిమాకు ప్రచారం చెయ్యలేదు. రిలీజుకు వారం ముందు నుంచి మాత్రమే ప్రమోషన్స్ టేకప్ చేశాడు. కొన్ని ఇంటర్వ్యూ.. ఈవెంట్స్ తో సరిపుచ్చాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో ప్రమోషన్స్ పూర్తిగా పక్కన పెట్టాడు. ఒక వైపు అల్లు అర్జున్.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలే తమ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రచారం మోతెక్కించారు. సినిమా రిలీజ్ తర్వాత ఇప్పటివరకూ ఏదో ఒక రూపంలో ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది విజయ్ తన సినిమాను ఇలా సరిగా ప్రచారం చెయ్యకుండా వదిలేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా సంగతి పక్కనపెట్టి పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడట. దీనిపై 'వరల్డ్ ఫేమస్ లవర్' టీమ్ అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. హిట్ టాక్ వస్తేనే ప్రమోషన్స్ చేస్తాడని.. ఫ్లాప్ టాక్ వస్తే పట్టించుకోడని కూడా విజయ్ గురించి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా చెయ్యడం సరికాదని ఇతర హీరోలను చూసి విజయ్ నేర్చుకోవాలని అంటున్నారు. మరి రౌడీగారు ఇవన్నీ పట్టించుకుంటారో లేదో!