'పుష్ప' కు మళ్ళీ షాక్.. పోలీసులకు ఫిర్యాదు చేసినా తప్పని లీకుల బెడద..!

Tue Sep 14 2021 16:01:39 GMT+0530 (IST)

The Pushpa leaked again

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప''. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రెడీ అవుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ''పుష్ప: ది రైజ్'' పేరుతో క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న చిత్ర బృందానికి.. సినిమాలోని కీలక సన్నివేశాలు లీక్ అవుతూ ఉండటం తలనొప్పిగా మారింది.'పుష్ప' సినిమా నుంచి 'దాక్కో దాక్కో మేక' సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వెర్షన్ తో పాటుగా ఫైట్ సీన్ - షూటింగ్ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ లీకుల వ్యవహారాన్ని మైత్రీ ప్రొడక్షన్ టీమ్ చాలా సీరియస్ గా తీసుకుని.. హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ప్రస్తుతం ఇన్వేస్టిగేషన్ చేస్తున్నారని.. తప్పు చేసిన వారిని పట్టుకుని శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని.. దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేసి లైఫ్ రిస్క్ లో పెట్టుకోవద్దని 'పుష్ప' నిర్మాతలు రిక్వెస్ట్ చేశారు. ఇంత చేసినా 'పుష్ప' లీకులకు బ్రేక్ పడలేదు.

తాజాగా 'పుష్ప' చిత్రం నుంచి మరో కీలక సన్నివేశం లీకైనట్లు తెలుస్తోంది. ఈసారి అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ సీన్ తో పాటుగా ఓ డైలాగ్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. 'ఇంతకు ముందో టూవీలరూ స్కూటరు మాట్లాడుల్లా.. నేనూ యాపారం చేసే దానికే తిరుపతి నుంచి వచ్చున్డాం' అంటూ బన్నీ చిత్తూరు యాసలో పలికిన డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలానే ప్రస్తుతం కాకినాడ పోర్టు ఏరియాలో జరుగుతున్న 'పుష్ప' షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలా సీన్స్ లీక్ అవడం నిర్మాతలను హీరో అభిమానులను ఇబ్బంది పెడుతోంది.

కాగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి బన్నీ - సుక్కూ కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.