అంత పెద్ద హిట్టుకి ఓటీటీలో అవాక్కయ్యే రిజల్ట్!

Sun May 22 2022 11:00:01 GMT+0530 (IST)

The Kashmir Files Movie

ఆడియెన్ మైండ్ లో ఏం ఉందో మంత్రదండం చేతిలో ఉన్న మాంత్రికుడు అయినా కనిపెట్టడం కష్టం. ఏ వర్గం ఆడియెన్ ఏ సినిమాని ఎందుకు ఆదరిస్తున్నారో అనేదానికి వంద శాతం అనాలిసిస్ లు గణాంకాలు ఏవీ లేవు.  అంతిమంగా అన్ని కోణాల్లో మంచి కంటెంట్ టెక్నిక్ వర్కవుట్ అయితే రిలీజ్ ముహూర్తం కలిసొస్తే నిర్మాతకు లక్ కుదిరితే అది బంపర్ హిట్ అవ్వొచ్చు. చాలాసార్లు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఐపు లేకుండా పోయినవి ఉన్నాయి కాబట్టి దేనినీ ఒకే దృష్టితో చూడలేని డైలమాలో ఉంది మార్కెట్.ఇటీవల ఓటీటీల రాకతో వెండితెర బుల్లితెర పరిస్థితులు అలానే మారిపోయాయి. నిజానికి ఓటీటీ అయినా రెగ్యులర్ గా ఒకే తరహా ఆదరణ దక్కించుకుంటోందా? అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల పెద్ద తెరపై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న భీమ్లా నాయక్ కి టీవీల్లో ఆదరణ కొరవడింది. టీఆర్పీ ఐపు లేకుండా పోవడం చర్చకు వచ్చింది. పెద్ద ధర పెట్టి కొనుక్కున్న శాటిలైట్ సన్నివేశం అపుడు ఎలా ఉంటుందో ఊహించాలి. భారీ క్రేజ్ ఉన్న సినిమాల్ని కొనుక్కున్న ఓటీటీలకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన ఎదురవుతోంది. అవాక్కయ్యేలా చేస్తోంది.

నిజానికి కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై పెద్ద తెర విడుదలకు ముందు సరైన అంచనాలే లేవు.  కానీ నెమ్మదిగా పుంజుకుని ఈ సినిమా దాదాపు 300 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంది? అంటే.. గత వారం ఈ సినిమా  జీ5 లో విడుదల కాగా..ఊహించని విధంగా తక్కువ స్పందన వచ్చింది. బిగ్ స్క్రీన్ పై భారీ కలెక్షన్స్ వచ్చిన ఏ సినిమా అయినా OTT విడుదలలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ నమోదు చేస్తుందని భావిస్తారు. కానీ కాశ్మీర్ ఫైల్స్ విషయంలో అది కుదరలేదు. అయితే దీనికి కారణాల్ని విశ్లేషిస్తే.. OTT విడుదల  చేసిన జీ5 నుండి పెద్దగా ప్రమోషన్లు లేవు. నిజానికి ప్రమోషన్స్ తో ఏదైనా సాధ్యం కానీ ఆ పని చేయలేదు.

OTTలోని కాశ్మీర్ ఫైల్స్ స్లో నేరేషన్ కారణంగా అలానే సుదీర్ఘ సంభాషణల కారణంగా చాలా మంది ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. డాక్యుమెంటరీ తరహా చిత్రీకరణ చిత్రానికి ప్రధాన లోపంగా కనిపిస్తుంది. పెద్ద స్క్రీన్ ప్రేక్షకులు అనుభవించిన భావోద్వేగాల కారణంగా థియేటర్లలోని కాశ్మీర్ ఫైల్స్ గొప్ప మౌత్ టాక్ ను అందుకుని విజయం సాధించిందని విశ్లేషిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ నిజానికి దేశభక్తి చిత్రం కాదు. కాశ్మీర్ పండిట్ లపై జరిగిన అకృత్యాలపై సినిమా. ప్రతి ఒక్కరికీ సమస్య గురించి ప్రాథమిక ఆలోచన ఉంటే తప్ప పాయింట్ తో సంబంధం ఏమిటో అర్థం చేసుకోలేరు. అదే కారణంతో తెలుగు- తమిళ డబ్బింగ్ వెర్షన్స్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలో మెరుపులు మెరిపించినా ఓటీటీలో ఫెయిలవ్వడానికి కారణమిదేనని విశ్లేషిస్తున్నారు. అంత పెద్ద హిట్టుకి ఓటీటీలో అవాక్కయ్యే రిజల్ట్ దక్కడం కొంత విచారకరం. నిజానికి అదే కాశ్మీర్ ఫైల్స్ ని శంకర్ కానీ రాజమౌళి కానీ తెరకెక్కిస్తే అది ఇంకోలా మారేదేమో!!