చిన్నప్పుడే ఆ స్టార్ హీరోయిన్ కి ప్రపోజ్ చేసిన హీరో

Thu Nov 25 2021 17:00:01 GMT+0530 (IST)

The Hero Who Proposed To That Star Heroine As A Child

సాధారణంగా చిన్నపిల్లలతో .. 'పెద్దయిన తరువాత నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు?' అనే ప్రశ్నను కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆ పిల్లలు తమకి బాగా చనువు ఉన్నవారిని చూపించగానే అక్కడి వాళ్లంతా గొల్లున నవ్వుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఆరేళ్ల కుర్రాడు మాత్రం ఎవరూ అడగకపోయినా ఒక స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని వాళ్లతో వీళ్లతో చెప్పడం ఎందుకు టైమ్ వేస్టు అనుకున్నాడో ఏమో ఏకంగా ఆమెకే చెప్పేశాడు. స్టార్ హీరోయిన్ వరకూ ఎలా వెళ్లాడబ్బా అంటే .. ఆ కుర్రాడు స్టార్ హీరో మేనల్లుడు గనుక.ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆ స్టార్ హీరో ఎవరు? ఆయన మేనల్లుడు ఎవరు? అనే ప్రశ్నలు అందరిలో పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆ స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా .. ఆ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ .. ఆయన మేనల్లుడైన ఆ కుర్రాడిపేరే ఇమ్రాన్ ఖాన్. 'ఐ హేట్ లవ్ స్టోరీస్' అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని చెప్పాడు. ఆమీర్ ఖాన్ - జుహీ చావ్లా కాంబినేషన్లో 'ఖయామత్ సే ఖాయమత్ తక్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 1988లో వచ్చిన ఈ సినిమా యూత్ ను ఒక ఊపు ఊపేసింది.

ఈ సినిమా షూటింగు జరుగుతున్న సమయంలోనే ఇమ్రాన్ ఖాన్ ఆమెను చూశాడు. ఆమె చాలా అందంగా అనిపించడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అదే విషయాన్ని ఆమెతో చెప్పేశాను కూడా అంటూ ఇమ్రాన్ ఖాన్ నవ్వేశాడు. పెళ్లి అంటే ఏమిటో తెలియని ఆ వయసులో తాను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం తనకి ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందని అన్నాడు. ఇప్పటికీ ఈ విషయం అప్పుడప్పుడూ గుర్తొస్తూ ఉంటుందనీ అలా గుర్తొచ్చినప్పడల్లా నవ్వుతూనే ఉంటానని చెప్పాడు.

ఇక ఈ విషయాన్ని గురించి జుహీ చావ్లా కూడా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ .. "ఇమ్రాన్ ఆరేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు .. చాలా మంచి పిల్లాడు. 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమా షూటింగు సమయంలో తరచూ అక్కడికి వచ్చేవాడు. చాలా క్యూట్ గా ఉండేవాడు .. ఆమీర్ ను మామూ అనీ .. నన్ను ఆంటీజీ అని పిలిచేవాడు. ఒకసారి హఠాత్తుగా నా దగ్గరికి వచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు కూడా. నేను ఎప్పుడూ నీకు ఆంటీజీనే అని నేను అనడంతో ఏం అర్థమైందో ఏమో జానీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు" అంటూ ఆమె నవ్వేశారు.