'ది ఘోస్ట్' అప్డేట్: కిల్లింగ్ మెషిన్ గా నాగ్..!

Thu Jul 07 2022 11:20:09 GMT+0530 (India Standard Time)

The Ghost Film Update

'బంగార్రాజు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ''ది ఘోస్ట్''. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా 'ది ఘోస్ట్' సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుందని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే ఈ యాక్షన్ బ్లాక్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో సినిమా నిర్మాణం పూర్తవుతుంది.

ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోన్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు మేకర్స్ ఈరోజు ప్రకటించారు. మీ అందరికీ వెన్నులో వణుకు పుట్టించే 'ది ఘోస్ట్' ఫస్ట్ విజువల్ ను జులై 9న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో "కిల్లింగ్ మెషీన్ ని వదులుతున్నాం" అని పేర్కొనడాన్ని బట్టి ఫస్ట్ విజువల్ యాక్షన్ ప్యాక్ గా ఉండబోతోందని అర్థం అవుతోంది.

నాగార్జున ఈ కిక్కాస్ పోస్టర్ లో రెండు చేతులతో ఒక పెద్ద కత్తిని పట్టుకుని సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది హింట్ ఇస్తున్నారు. ఫార్మల్ సూట్ లో ఉన్న నాగ్ క్రూరంగా కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో ఎర్రబడిన చంద్రుడిని మనం చూడవచ్చు. మొత్తం మీద ఈ పోస్టర్ రాబోయే టీజర్ పై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

''ది ఘోస్ట్'' సినిమాలో నాగ్ తొలిసారిగా ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభవాన్ని అందించేలా దర్శకుడు ప్రవీణ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. గ్రాండ్ విజువల్స్ తో అద్భుతమైన లొకేషన్స్ లో గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'ది ఘోస్ట్' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో నాగ్ గెటప్ మరియు మేకోవర్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. గుల్ పనాగ్ మరియు అనిఖా సురేంద్రన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై పుష్కర్ రామ్మోహనరావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టెక్నికల్ క్రూ విషయానికి వస్తే ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. దినేష్ సుబ్బరాయన్ మరియు కిచ్చా స్టంట్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.