'ఘోస్ట్' లో హీరోయిన్ కి అంతుందా?

Wed Sep 28 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

The Ghost Actress Sonal Chauhan

టాలీవుడ్ లో ఏ హీరో సినిమా చేసినా...హీరోకి ధీటుగా హీరోయిన్ పాత్ర ని డిజైన్ చేయడం అన్నది అసాధ్యం. హీరో ఇమేజ్ మీద నడిచే ఇండస్ర్టీ కాబట్టి హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ముందే విషయం లీకైతే మార్కెట్ పరంగానూ కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఆ విషయంలో మార్పులొస్తున్నాయి.తాజాగా కింగ్ నాగార్జున కథానాయకుడిగా ప్రవీష్ సత్తారు దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ది ఘోస్ట్ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య  అక్టోబర్ 5 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది.  నాగ్.. సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా నటించారు. అయితే తొలుత హీరోయిన్ పాత్రకి కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసారు.

ఆమెపై రెండు రోజులు షూటింగ్ కూడా చేసారు. కానీ కాజల్ అదే సమయంలో గర్భం దాల్చడంతో ఉన్న పళంగా ప్రాజెక్ట్ నుంచి నిష్ర్కమించింది. దీంతో దర్శకుడికి తదుపరి హీరోయిన్ ని ఎంపిక చేయడం అన్నది సవాల్ గానే మారిందన్న విషయాన్ని రివీల్ చేసారు. 'యాక్షన్  కుటుంబ అంశాలతో కూడిన సాధారణ చిత్రమిది. యాక్షన్ సీక్వెన్స్‌లు ఆర్గానిక్‌గా వస్తాయని.. కథ డిమాండ్ చేస్తుందన్నారు.

కాజల్ తప్పుకోవడంతో ఎవర్నీతీసుకోవాలో అర్ధం కాలేదు. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఎనర్జిటిక్ గా నటించాలి. నాగార్జునతో భుజం భుజం కలిపి నిలబడాలి. హీరోయిన్ నాగార్జునని రక్షించే సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయనకు ధీటుగా ఎవరు నటిస్తారు? అన్న తరుణంలో  మేకర్స్ సోనాల్ చౌహాన్‌ని ఎంపిక చేసామన్నారు.

పాత్ర కు ఆమె వంద శాతం న్యాయం చేసింది. తన పాత్రలో అద్భుతంగా నటించిందని' దర్శకుడు చెప్పారు. మొత్తానికి 'ఘోస్ట్' లో  నాగ్ కి ధీటుగానే హీరోయిన్ పాత్ర కూడా మలిచినట్లు కనిపిస్తుంది. ఇది టాలీవుడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసినట్లే. మన ఇండస్ర్టీలో హీరోని కాపాడే హీరోయిన్  ఉందంటే?   సినిమాని రకరకాల కోణాల్లో విశ్లేషించడం మొదలు పెడతారు.

వర్కౌట్ అయితే పొగిడేస్తారు అదే  తేడా కొడితే అంతకంతకు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఘోస్ట్ చిత్రాన్ని సునీల్ నారంగ్- పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.