Begin typing your search above and press return to search.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ తో తెలుగు నిర్మాత 'ది ఢిల్లీ ఫైల్స్'

By:  Tupaki Desk   |   13 Sep 2021 7:41 AM GMT
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ తో తెలుగు నిర్మాత ది ఢిల్లీ ఫైల్స్
X
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అగ్నిహోత్రి.. ఇప్పుడు ''ది ఢిల్లీ ఫైల్స్'' అనే మరో వైవిధ్యమైన చిత్రానికి శ్రీకారం చుట్టారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ - ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది.

''ది ఢిల్లీ ఫైల్స్'' సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని ఈరోజు సోమవారం మేకర్స్ విడుదల చేశారు. గత రెండు చిత్రాల్లో న్యాయ హక్కు - సత్యపు హక్కుల గురించి చర్చించిన దర్శకుడు.. ఈసారి జీవించే హక్కు గురించి చెప్పబోతున్నాడు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఢిల్లీ లో జరిగిన ఓ దుర్ఘటనను ఈ సినిమా ద్వారా తెరపైకి తెస్తున్నారు. ఇది భవిష్యత్ తరాలకు మచ్చగా మిగిలిపోయిన గతానికి లోతైన డైవ్ అని చిత్ర బృందం పేర్కొంది.

తెలుగు నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌ - అర్చన అగర్వాల్.. వివేక్ అగ్నిహోత్రి - పల్లవి జోషి లతో కలిసి ''ది ఢిల్లీ ఫైల్స్'' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ మరియు పంజాబీ భాషలో రూపొందే ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో భాగం అవుతున్న ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తర్వాత వెల్లడిస్తారు. 2022 అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి ట్వీట్ చేస్తూ.. మా కలయికలో ఓ బోల్డ్ సినిమాని ప్రకటించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

''సత్యాన్ని దాచడం, న్యాయాన్ని తిరస్కరించడం మరియు మానవ జీవితానికి విలువ లేకపోవడం వంటివి మన ప్రజాస్వామ్యంపై మచ్చలుగా పరిగణించవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం, నేను స్వతంత్ర భారతదేశం చెప్పలేని కథలను చెప్పడం ప్రారంభించాను. 'ది తాష్కెంట్‌ ఫైల్స్‌' లో రైట్ టూ ట్రూత్ గురించి.. 'ది కాశ్మీర్‌ ఫైల్స్‌' (త్వరలో విడుదల అవుతుంది) చిత్రంలో న్యాయ హక్కు గురించి చెప్పాను. ఇప్పుడు ''ది ఢిల్లీ ఫైల్స్'' సినిమాలో జీవించే హక్కు గురించి చెప్పబోతున్నాను. హిందీ పంజాబీలలో త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి'' అని దర్శకుడు అన్నారు.