ఎండ్ గేమ్ కోసం ఓపిగ్గా కూర్చోవాల్సిందే

Mon Apr 22 2019 20:00:01 GMT+0530 (IST)

The Avengers: Endgame Release in Hyderabad

ఈ శుక్రవారం విడుదల కానున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ భీభత్సంగా నడుస్తోంది. హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో మొదటి మూడు రోజులు టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో ఆన్ లైన్ లో పెట్టిన గంటల్లోనే హాట్ కేకుల్లా సీట్లు బ్లాక్ అవుతున్నాయి.ఇకపోతే సాధారణంగా ఎంత భారీ బడ్జెట్ ఇంగ్లీష్ సినిమా అయినా నిడివి మహా అయితే గంటన్నర లేదా అంతకు ఓ పది నిముషాలు ఎక్కువగా ఉంటుంది తప్ప చాలా అరుదుగా రెండున్నర గంటలు దాటిన సందర్భాలు ఉంటాయి. గత ఏడాది వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఈ విషయంలో మెప్పించి లెన్త్ ఎక్కువయినా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకుంది. ఇప్పుడు ఎండ్ గేమ్ ఇంకో రెండాకులు ఎక్కువ చదువుకుంది

అవెంజర్స్ ఎండ్ గేమ్ సెన్సార్ పూర్తి చేసుకున్న నిడివి అక్షరాలా 3 గంటల 1 నిమిషం. ఇంటర్వెల్-ప్రారంభానికి ముందు వేసే యాడ్స్- మధ్యలో బ్రేక్ టైం లో వేసే ప్రకటనలు మొత్తం కలిపి ఇంకో 15 నిముషాలు అదనం. అంటే సినిమా హాల్ లోనే మూడున్నర గంటల దాకా సమయాన్ని ఖర్చు పెడితే తప్ప ఎండ్ గేమ్ అనుభూతిని సంపూర్ణంగా అనుభవించలేమన్న మాట.

ఒకవేళ హైదరాబాద్ లాంటి చోట్ల అయితే ఇంటి నుంచి థియేటర్ కు చేరుకోవడానికి పెట్టె సమయాన్ని కూడా కలుపుకోవాలి. ఏదో అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం అన్నంత క్యాజువల్ గా ఎండ్ గేమ్ ఎక్స్ పీరియన్స్ అయితే ఉండబోవడం లేదు. మొత్తం 2500 స్క్రీన్లలో ఇండియన్ వెర్షన్స్ రిలీజ్ చేయబోతున్నారు. పనిలో పని ఇంత సేపు లోపల చేతులు నోళ్లు ఖాళీగా ఉంచడం కష్టం కాబట్టి స్నాక్స్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగేలా ఉంది